Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Mar 2024 13:03 IST

1. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన భారాస

పెండింగులో ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస (BRS) అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు భారాస ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. హైదరాబాద్‌ స్థానాన్ని మాత్రం పెండింగులో ఉంచింది. నేడు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారాస అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లయింది. పూర్తి కథనం

2. ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం..!

జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయం (Mahakaleshwar Temple)లో నేడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 13 మంది గాయపడినట్లు తెలుస్తోంది. హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. పూర్తి కథనం

3. ఒకే రోజు రెండు రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌..!

ఉక్రెయిన్‌(Ukraine)తో జరుగుతున్న యుద్ధంలో రష్యా(Russia)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్లసముద్ర దళంలోని రెండు కీలక నౌకలను కీవ్‌ దళాలు ఒకే రోజు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ విభాగం ప్రకటించింది. యమాల్‌, ఆజోవ్‌ ల్యాండింగ్‌ షిప్స్‌ను  పేల్చివేసినట్లు తెలిపింది. పూర్తి కథనం

4. లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత పీహెచ్‌డీ విద్యార్థిని మృతి

లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన చేష్ఠా కొచ్చర్‌ దుర్మరణం చెందారు. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ (LSE)లో ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. గతంలో ఆమె నీతి ఆయోగ్‌కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం పనిచేశారు.పూర్తి కథనం

5. మాస్కో ఉగ్రదాడి.. నేరాన్ని అంగీకరించిన ముష్కరులు!

మాస్కో ఉగ్రదాడిలో (Moscow concert attack) పోలీసులకు చిక్కిన నలుగురు ముష్కరుల్లో ముగ్గురు నేరాన్ని అంగీకరించారు. సంగీత కచేరీపై తుపాకులు, బాంబులతో విరుచుకుపడిన వారిలో తామూ ఉన్నామని ఆదివారం కోర్టు ముందు వెల్లడించారు. దీంతో తజకిస్థాన్‌కు చెందిన ఈ నలుగురినీ మే 22 వరకు కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి కథనం

6. భాజపాలో చేరిన గాలి జనార్దన రెడ్డి.. పార్టీ విలీనం

కర్ణాటక (Karnataka) మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి (Gali Janardhana Reddy) భాజపా (BJP) గూటికి చేరారు. బెంగళూరులో సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప సమక్షంలో జనార్దనరెడ్డి, ఆయన సతీమణి అరుణ లక్ష్మి కాషాయ కండువా వేసుకున్నారు. తన పార్టీని కూడా భాజపాలో విలీనం చేశారు.పూర్తి కథనం

7. భాజపా అభ్యర్థిగా ‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు..

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లుు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.పూర్తి కథనం

8. హైదరాబాద్‌లో హోలీ వేడుకలు..

హైదరాబాద్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరస్పరం రంగులు చల్లుకుంటూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ వేడుకలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆ చిత్రాలివీ..పూర్తి కథనం

9. తెలంగాణలో 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు!

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మిగిలిన ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఈనెల 27న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. బుధవారం జరగనున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.పూర్తి కథనం

10. మోదీపై మూడోసారి పోటీకీ అజయ్‌రాయ్‌

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ విడుదల చేసిన నాలుగో జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు అజయ్‌రాయ్‌. బాహుబలి నేతగా పేరొందిన యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను ప్రధాని మోదీపై పోటీకి వారణాసిలో కాంగ్రెస్‌ మూడోసారి బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ జట్టుకట్టిన నేపథ్యంలో వారణాసిలో మోదీకి అజయ్‌రాయ్‌ ఏ మేరకు పోటీనిస్తారు. రెండుసార్లు మోదీ చేతిలో ఓడినా మళ్లీ రాయ్‌నే కాంగ్రెస్‌ ఎందుకు నమ్ముకుంది?ఈ వీడియోలో చూద్దాం.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని