Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 23 Feb 2024 17:40 IST

1. Lasya Nanditha: కారు ప్రమాదంలో భారాస ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(37) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్‌, డ్రైవర్‌  తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎమ్మెల్యే మృతదేహాన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు. పూర్తి కథనం

2. Lasya Nanditha: లాస్య నందిత మృతి పట్ల నేతల సంతాపం

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెదేపా అధినత చంద్రబాబునాయుడు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబసభ్యులను మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. పటాన్‌చెరు ఆస్పత్రికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. పూర్తి కథనం

3. PNS Ghazi: విశాఖ తీరంలో పాక్‌ జలాంతర్గామి గాజీ శకలాలు..!

వైజాగ్‌ తీరంలో పాకిస్థాన్‌ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్‌ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్‌ గాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చింది. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని సబ్‌మెరైన్‌ రెస్క్యూ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ధ్రువీకరించారు. పూర్తి కథనం

4. MP Raghurama: ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి రఘురామ ఫిర్యాదు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై ఏంపీ రఘురామ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లను పెట్టాలని ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఆ హెలికాప్టర్లను ఎన్నికల వేళ సీఎం జగన్‌ వినియోగించనున్నారనే వార్తల నేపథ్యంలో రఘురామ ఈసీకి ఫిర్యాదు చేశారు. పూర్తి కథనం

5. Lasya Nanditha: లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. పూర్తి కథనం

6. AP News: వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్‌ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. పూర్తి కథనం

7. YS Sharmila: ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు : వైఎస్‌ షర్మిల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) తనకు దగ్గర మనిషి అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (ys sharmila) అన్నారు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నారు. ‘ఆళ్లపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఆయన చెల్లిగా నేను అర్థం చేసుకోగలను. ఒక మంచి పర్సన్‌.. రాంగ్‌ ప్లేస్‌లో ఉన్నారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

8. Byjus: నేడు తేలనున్న బైజూస్‌ సీఈఓ రవీంద్రన్ భవితవ్యం!

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సీఈఓ రవీంద్రన్ (Byju Raveendran) భవితవ్యం నేడు తేలనుంది. కంపెనీ ఇన్వెస్టర్లు పిలుపునిచ్చిన అసాధారణ వాటాదార్ల సమావేశం (EGM) శుక్రవారం జరగనుంది. ఆయన్ని పదవి నుంచి తొలగించి కొత్త బోర్డును ఎన్నుకోవాలనే లక్ష్యంతో వారు భేటీ అవుతున్నారు. అయితే, దీన్ని నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టును సంస్థ (Byjus) ఆశ్రయించగా.. చుక్కెదురైన విషయం తెలిసిందే. పూర్తి కథనం

9. Rahul Gandhi: రాహుల్‌ను కలుద్దామనుకుంటే.. బరువు తగ్గమన్నారు..!

దిల్లీ: మహారాష్ట్ర నేత బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీ(Zeeshan Siddique) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను కలిసేందుకు తనకెదురైన అడ్డంకి ఆశ్చర్యం కలిగించిందన్నారు. పూర్తి కథనం

10. Private lander: చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేటు ల్యాండర్‌

అమెరికాకు చెందిన ప్రైవేటు ల్యాండర్‌ ఒడిస్సస్‌ (Odysseus Lander) గురువారం చంద్రుడిపై దిగింది. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర ఇదే కావడం గమనార్హం. తాజా ప్రయోగంతో ఒక ప్రైవేటు సంస్థ చంద్ర మండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లయింది. గతవారమే ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (Intuitive Machines) ఈ ల్యాండర్‌తో కూడిన రాకెట్‌ను ప్రయోగించింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని