Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Jul 2023 13:02 IST

1. రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పవన్‌ వ్యాఖ్యలపై ఆర్జీవీ ట్వీట్‌.. పోలీసులకు ఫిర్యాదు

సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(ఆర్జీవీ)పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌ మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తితిదే ఈవో

శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘ శ్రీవాణి ట్రస్టుపై మరో ఆరోపణ వచ్చింది. కావాల్సిన వారికి ఆలయాలు నిర్మాణ కాంట్రాక్ట్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతుంది. పార్వేట మండపాన్ని కూల్చివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బీభత్సం

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అతివేగంతో మెహిదీపట్నం వెళ్తుండగా బోల్తాపడింది. ప్రమాదతీవ్రతకు ఎయిర్‌పోర్టు వైపునకు వెళ్తున్న మూడు కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వెంకటేశ్‌, విజయ్‌ సేతు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సౌత్‌ జోన్‌దే దులీప్ ట్రోఫీ

దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీని (Duleep Trophy) సౌత్‌ జోన్‌ కైవసం చేసుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్ట్‌జోన్‌పై  75 పరుగుల తేడాతో సౌత్‌ జోన్‌ విజయం సాధించింది.  సౌత్‌జోన్ కెప్టెన్ హనుమ విహారి  జట్టును ముందుండి నడిపించాడు. సౌత్‌జోన్‌ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్‌జోన్‌ 222 పరుగులకే ఆలౌటైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కల్వరీ జలాంతర్గాముల డీల్‌ తొలగింపు..!

ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో కుదిరిన మూడు అదనపు జలాంతర్గాముల డీల్‌.. తాజాగా ఇరు దేశాల సంయుక్త ప్రకటన నుంచి అదృశ్యమైంది. ఈ ప్రకటన కాపీ విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్‌ అయ్యింది. కానీ, ఆ తర్వాత దీనికి సంబంధించిన రివైజ్డ్‌ కాపీని ఆ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీని నుంచి కల్వరీ శ్రేణి అదనపు జలాంతర్గాముల నిర్మాణ ఒప్పందం అంశాన్ని తొలగించడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాంవడ్‌ యాత్రలో విషాదం.. ఐదుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో విషాదం చోటుచేసుకుంది. కాంవడ్‌ యాత్ర(Kanwariya Pilgrims) చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మేరఠ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భార్య మృతదేహాన్ని తరలిస్తుండగా భర్త మృతి

మంచిర్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుంది. పక్కింటి వాళ్ల గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంలో ఈ ఘటన జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డ్రైవర్‌ను చితకబాది.. బియ్యం లారీతో ఉడాయించిన దుండగులు

విశాఖ నగర పరిధిలో బియ్యం లారీని దుండగులు ఎత్తుకెళ్లారు. డ్రైవర్‌ను చితకబాది లోడుతో ఉన్న లారీని తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎయిర్‌పోర్టు దాటిన తర్వాత గాజువాక వైపు వెళ్తున్న బియ్యం లారీని ముగ్గురు దుండగులు ఆపారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది అతడి వద్ద ఉన్న కొంత నగదు, లారీతో ఉడాయించారు. డ్రైవర్‌ ఫిర్యాదుతో కంచరపాలెం పోలీసుల కేసు నమోదు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమరావతి రైతుల కన్నీటి కడలిలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది: దేవినేని

రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రార్థిస్తూ యాగం చేపట్టారు. రేపు ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతికి మద్దతుగా తీర్పు రావాలని ప్రార్థించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని