India-France: ఇండియా-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన నుంచి కల్వరీ జలాంతర్గాముల డీల్‌ తొలగింపు..!

భారత్‌-ఫ్రాన్స్‌ చేపట్టనున్న మూడు అదనపు జలాంతర్గాముల నిర్మాణ డీల్‌ విషయం ఇరు దేశాల సంయుక్త ప్రకటన నుంచి తొలగించారు. దీనికి కారణాలు తెలియరాలేదు. ఇరు దేశాల మధ్య జలాంతర్గాముల విషయంలో సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. 

Updated : 16 Jul 2023 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌(India) ప్రధాని మోదీ(PM Modi) ఫ్రాన్స్‌(France ) పర్యటనలో కుదిరిన మూడు అదనపు జలాంతర్గాముల డీల్‌.. తాజాగా ఇరు దేశాల సంయుక్త ప్రకటన నుంచి అదృశ్యమైంది. ఫ్రాన్స్‌ బాస్టీల్‌ డే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మేక్రాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కల్వరీ శ్రేణికి చెందిన మూడు అదనపు జలాంతర్గాముల నిర్మాణంపై నేవల్‌ గ్రూప్‌-మాజ్‌గావ్‌ డాక్‌ లిమిటెడ్‌ అవగాహనకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన కాపీ విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్‌ అయ్యింది. కానీ, ఆ తర్వాత దీనికి సంబంధించిన రివైజ్డ్‌ కాపీని ఆ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీని నుంచి కల్వరీ శ్రేణి అదనపు జలాంతర్గాముల నిర్మాణ ఒప్పందం అంశాన్ని తొలగించడం గమనార్హం.

గగన్‌యాన్‌పై పెరిగిన భరోసా!

ఈ స్థానంలో.. భారత జలాంతర్గాములు మరింత శక్తిమంతంగా పనిచేసేందుకు అవసరమైన కలల ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. గతంలో ఇరు దేశాల కంపెనీలు కలిసి చేపట్టిన ప్రాజెక్టు-75 జరిగిన తీరును అభినందించారు. దీంతోపాటు డీఆర్‌డీవో-సాఫ్రన్‌ సంస్థలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ తయారీకి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఈ ఏడాది చివరికి సిద్ధం చేయాలన్న అంశాన్ని కూడా తొలగించారు. అయితే.. ఇరు దేశాలు అంగీకరించిన కాపీనే సంయుక్త ప్రకటనగా విడుదల చేస్తారని ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్‌కు బయల్దేరిన సమయంలోనే.. 26 రఫేల్‌ ఎం రకం యుద్ధవిమానాలు, మూడు స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల కొనుగోలుకు భారత్‌ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన రక్షణశాఖ ప్రతిపాదనలకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదం వేసింది. కానీ, రఫేల్‌ విమానాల కొనుగోలు ప్రస్తావన మోదీ తన పర్యటనలో తీసుకురాలేదు. కానీ, రఫేల్‌ యుద్ధ విమానాలు తయారు చేసే దసో ఏవియేషన్‌ ఓ ప్రకటన వెలువరించింది. తాజాగా కల్వరీశ్రేణి సబ్‌మెరైన్ల డీల్‌ కూడా సంయుక్త ప్రకటన నుంచి తొలగించారు. వీటి కొనుగోలుకు సుమారు రూ.90వేల కోట్ల అవుతున్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ.. ఒప్పందం పూర్తైన తర్వాతే కచ్చితమైన విలువ తెలియనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని