Duleep Trophy: సౌత్‌ జోన్‌దే దులీప్ ట్రోఫీ.. ఫైనల్‌లో వెస్ట్‌జోన్ ఓటమి

అత్యధిక టైటిళ్లను గెలిచిన వెస్ట్‌ జోన్‌ (19సార్లు విజేత) ను ఓడించి దులీప్ ట్రోఫీ (Duleep Trophy) ఛాంపియన్‌గా సౌత్‌జోన్‌ నిలిచింది. ఫైనల్‌లో వెస్ట్‌జోన్‌పై సౌత్‌జోన్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.   

Updated : 17 Jul 2023 08:58 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీని (Duleep Trophy) సౌత్‌ జోన్‌ కైవసం చేసుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్ట్‌జోన్‌పై  75 పరుగుల తేడాతో సౌత్‌ జోన్‌ విజయం సాధించింది.  సౌత్‌జోన్ కెప్టెన్ హనుమ విహారి  జట్టును ముందుండి నడిపించాడు. సౌత్‌జోన్‌ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్‌జోన్‌ 222 పరుగులకే ఆలౌటైంది. వెస్ట్ జోన్‌ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్‌ (95), సర్ఫరాజ్‌ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57), విద్వత్‌ కావేరప్ప (1/51), వైశాక్ (1/39) దెబ్బకు వెస్ట్‌ జోన్‌ కుదేలైంది. 

వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు

సౌత్‌జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే వెస్ట్‌ జోన్ ఆలౌట్‌  చేసింది. అయితే, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం కావడంతో వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. సౌత్‌ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్‌ జోన్‌ను దెబ్బకొట్టాడు. పృథ్వీషా, పుజారా, సూర్యకుమార్‌ యాదవ్, సర్ఫరాజ్‌ఖాన్ వంటి టాప్‌ బ్యాటర్లు ఉన్నప్పటికీ కావేరప్ప ధాటికి నిలవలేకపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (8, 4), పుజారా (4, 15) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచారు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన సౌత్‌ జోన్‌ 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులను సౌత్‌ జోన్ బౌలర్ కావేరప్ప సొంత చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు సౌత్‌జోన్‌ 14 టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. 

స్కోరు వివరాలు: 

సౌత్‌ జోన్: తొలి ఇన్నింగ్స్‌ 213, రెండో ఇన్నింగ్స్‌ 230.

వెస్ట్‌ జోన్: తొలి ఇన్నింగ్స్‌ 146. రెండో ఇన్నింగ్స్‌ 222.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని