Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Jul 2023 13:00 IST

1. వర్షంలోనే రోడ్డుపై కిషన్‌రెడ్డి బైఠాయింపు

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బాటసింగారంలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని భాజపా నిర్ణయించింది. దీనిలో భాగంగా శంషాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు బాటసింగారం బయల్దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది.ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, భాజపా రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితర అంశాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షల రీషెడ్యూల్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి..

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు నీటిమట్టం 41.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. భారీగా కురిసిన వర్షానికి రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. లింగంపల్లి అండర్‌పాస్‌ కిందకు భారీగా వరదనీరు..

నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగంపల్లి రైల్వే అండర్‌పాస్‌ కిందకు భారీగా వరదనీరు చేరింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే వరదనీటితో లింగంపల్లి అండర్‌పాస్‌ రోడ్డు దారుణంగా తయారవుతోందని.. ఈ సమస్యను పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మణిపుర్‌ ఘటన అనాగరికం: కేటీఆర్‌ ట్వీట్‌

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మణిపుర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌..!

మణిపుర్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ ఘటన తనను ఆందోళనకు గురిచేశాయని, ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మణిపుర్‌ ఘటన దేశానికి సిగ్గుచేటు: ప్రధాని మోదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్‌ (Manipur Video)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..

నిఫ్టీలో శక్తిమంతమైన కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విభజన ప్రభావం మార్కెట్లపై పడింది. ఫలితంగా వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 19,812 వద్ద, సెన్సెక్స్‌ 74 పాయింట్ల పతనంతో 67,023 వద్ద ట్రేడవుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పాస్‌వర్డ్ షేరింగ్ ఇకపై కుదరదు: నెట్‌ఫ్లిక్స్

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్‌ పొందగలరని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. అందులో నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై ఓటీటీ సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టంచేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు