Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..

దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.

Published : 20 Jul 2023 09:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిఫ్టీలో శక్తిమంతమైన కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విభజన ప్రభావం మార్కెట్లపై పడింది. ఫలితంగా వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 19,812 వద్ద, సెన్సెక్స్‌ 74 పాయింట్ల పతనంతో 67,023 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌హెచ్‌ఐ మాగ్నసైట్‌ ఇండియా, హ్యూస్టన్‌ ఆగ్రో, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, పీఎన్‌సీ ఇన్ఫ్రా, స్టార్‌ సిమెంట్‌ వంటి షేర్లు లాభాల్లో ఉండగా.. అలోక్‌ ఇండస్ట్రీస్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, మోల్డ్‌ టెక్‌ ప్యాకేజింగ్‌, మహీంద్రా హాలిడేస్‌ షేర్ల విలువ కుంగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడి 82.02 వద్ద మొదలైంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకు నేడు ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌

అమెరికా మార్కెట్‌ సూచీలు బుధవారం ట్రేడింగ్‌ను లాభాల్లో ముగించాయి. ఆసియా-పసిఫిక్‌ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా సూచీ 0.14 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.35శాతం, తైవాన్‌ టీఎస్‌ఈసీ 50 0.62శాతం లాభాల్లో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ సూచీ 0.29శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.14శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఆర్‌ఐఎల్‌ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ - జేఎఫ్‌ఎస్‌ఎల్‌గా పేరు మారనుంది) విభజించి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తోంది. అంటే 100 ఆర్‌ఐఎల్‌ షేర్లకు 100 జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేర్లు లభిస్తాయి. ఈ షేర్లకు నేడు ప్రత్యేక ప్రీ- ఓపెన్‌ సెషన్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిర్వహిస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి విభజించిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరుకు స్థిర విలువను ఈ ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌ ద్వారా లెక్కిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని