Modi: మణిపుర్‌ ఘటన దేశానికి సిగ్గుచేటు: ప్రధాని మోదీ

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

Updated : 20 Jul 2023 12:48 IST

దిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్‌ (Manipur Video)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.

నగ్నంగా మహిళల ఊరేగింపు.. వీడియోలు తొలగించాలని కేంద్రం ఆదేశాలు..!

‘‘మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై అమానవీయ ప్రవర్తన నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది. ఆ మణిపుర్‌ కుమార్తెలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేం. మహిళల భద్రత విషయంలో రాజీపడబోం. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నా. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. నిందితులను శిక్షించేందుకు చట్టం పూర్తి శక్తితో పనిచేస్తుంది’’ అని మోదీ తెలిపారు. మణిపుర్‌లో పోరుబాట పట్టిన వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించి, వారిని నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. మే 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతరం పార్లమెంట్‌ సమావేశాల (Parliament Mansoon Session) గురించి మాట్లాడుతూ.. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలన్నారు. ‘‘అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం దొరుకుతుంది. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు బిల్లులు తెస్తున్నాం. ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు ఈ సమయం వినియోగించుకోవాలి’’ అని మోదీ (PM Modi) విపక్షాలకు పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని