Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Aug 2023 13:17 IST

1. నూహ్‌లో కొనసాగుతున్న బుల్డోజర్‌ యాక్షన్‌.. మెడికల్‌స్టోర్లు, దుకాణాలు కూల్చివేత

హరియాణా (Haryana)లోని నూహ్‌ (Nuh) జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్ల (Bulldozer)తో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తావ్‌డూ పట్టణంలో నిన్న అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం నల్హార్‌ ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు. ఆసుపత్రి వద్ద ఉన్న మెడికల్‌ షాపులు, ఇతర దుకాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కోటయ్య కుటుంబంపై మరోసారి వైకాపా నేత దాడి

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో కోటయ్య కుటుంబంపై మరోసారి దాడి జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆగ్రహంతో తెదేపా సానుభూతిపరుడు కోటయ్య కుటుంబంపై వైకాపాకు చెందిన ఉప సర్పంచి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శనివారం మరోసారి దాడికి దిగారు. ఈ ఘటనలో కోటయ్య తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా తమపై దాడి జరుగుతున్నా.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితులు వాపోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు ఎలా న్యాయం చేస్తారు?: గవర్నర్‌ తమిళిసై

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వివరణ కోరారు. ‘‘ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా?  విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని  మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. యూట్యూబర్‌ ‘ఫ్రీ గిఫ్ట్‌’లకు ఎగబడ్డ జనం.. రణరంగంగా న్యూయార్క్‌ వీధులు

తన అభిమానులకు బహుమతులు ఇస్తానని ప్రకటించి చిక్కుల్లో పడ్డాడో ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ (Online Influencer). అతడిచ్చే కానుకలు తీసుకునేందుకు వేలాది మంది ఒక్కసారిగా పోటెత్తడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లర్లు చెలరేగి పరిస్థితులు రణరంగంగా మారాయి. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యాయరు. అమెరికా (USA)లోని న్యూయార్క్‌ (New York)లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కుప్పంలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు.. ఆర్టీసీ బస్సుపై దాడి, వ్యాపారులకు బెదిరింపులు!

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. నిరసనలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై దాడికి పాల్పడ్డారు. 40 మందితో కుప్పం డిపో బస్సు కృష్ణగిరి నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సులో ఉన్న తమిళనాడుకు చెందిన ప్రయాణికులు  తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.  ఈ దాడిలో బస్సు పాక్షికంగా దెబ్బతింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి

అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితులకు శుక్రవారం రాత్రి విందు ఇచ్చాడు. విందు అనంతరం తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మణిపుర్‌లో ఆగని హింస.. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి దుండగుల కాల్పులు

జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోన్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపుర్‌ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ హింస ( Violence) చెలరేగింది. మృతిచెందిన వారు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందిన వారని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి వీరు తమ ఇళ్లకు కాపాలా కాస్తుండగా గుర్తుతెలియని దుండగులు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ స్మాల్‌ గ్యాడ్జెట్స్‌తో మీ ఇల్లు మరింత స్మార్ట్‌

బయటకెళ్లి వచ్చినప్పుడు ఏ చిప్స్ ప్యాకెటో.. స్నాక్సో కొంటాం. సగం తిని వదిలేస్తే అవి పాడైపోతాయి. అలా పాడవ్వకుండే ప్యాక్‌ చేసేందుకు ఏదైనా వస్తువు ఉంటే ఎంత బాగుణ్ణో అనిపిస్తుంది కదా! అలాగే కరెంటు పోయిన సందర్భంలో పక్క గదికి పోవాలన్నా భయం. అప్పుడు మనం డోర్ తీయగానే లైట్‌ వెలిగేలా ఏర్పాటు ఉంటే ఎంత బాగుంటుందో కదూ! ఒకవేళ ఉన్నా వాటి ధర ఏ వేలల్లోనో ఉంటుందని ఆలోచిస్తున్నారా? అస్సలు కానేకాదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చికిత్స కోసం స్టార్‌హీరో రూ.25 కోట్ల సాయమంటూ వార్తలు.. సమంత ఏమన్నారంటే

మయోసైటిస్‌ చికిత్స కోసం సమంత(Samantha)కు.. ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై తాజాగా సమంత పరోక్షంగా స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. తన సమస్యను తానే పరిష్కరించుకోగలనని.. వేరే వాళ్ల నుంచి ఆర్థిక సాయం పొందాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ : సబా కరీమ్‌

ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni). జార్ఖండ్‌ డైనమైట్‌, ‘కెప్టెన్‌ కూల్’, ది ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ధోనీ టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లను అందించాడు. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ధోనీ గురించి బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్‌ (Saba Karim) తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అతడిని తొలిసారి రంజీ మ్యాచ్‌ (Ranji Trophy) సందర్భంగా కలిసినట్లు గుర్తు చేసుకున్నాడు. అతడి నైపుణ్యాలను చూసి అబ్బురపడినట్లు పేర్కొన్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు