Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Aug 2023 13:15 IST

1. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీని సస్పెండ్‌ చేశాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

నగరంలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో బాలికలపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కెనడాలోని హిందూ దేవాలయంలో ఖలిస్థానీల విధ్వంసం

కెనడా (Canada)లో ఖలిస్థానీల ఆగడాలు పెరిగిపోయాయి. తాజాగా ఓ హిందూ దేవాలయంలో వారు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా(British Columbia)లో ఉన్న పురాతన లక్ష్మీనారాయణ ఆలయంలో చోటు చేసుకొంది. దాడి అనంతరం ఖలిస్థానీ రెఫరెండం పోస్టర్లను ఆలయంపై అంటించారు. వీటిపై ‘జూన్‌ 18 నాటి ఘటనలో భారత్‌ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది’ అని రాసి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తూచ్‌.. రుషికొండపై నిర్మిస్తోంది సెక్రటేరియట్‌ కాదు: వైకాపా మరో ట్వీట్

విశాఖపట్నంలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై అధికార వైకాపా(YSRCP) ఒక్కరోజులోనే మాట మార్చేసింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయమేనని శనివారం రాత్రి పేర్కొనగా.. దానిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గుతూ ఆదివారం ఉదయం మరో ట్వీట్‌ చేసింది. ‘‘మా అధికారిక ట్విటర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పురుగుల మందు తాగుతూ.. భార్యాభర్తల సెల్ఫీ వీడియో

సెల్ఫీ వీడియో తీసుకుంటూ దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. నర్మెట్ట మండలంలోని సూర్యబండ తండాకు చెందిన భార్యాభర్తలు భూక్య గురు, సునీతకు కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని ఇతరులు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన వారు ఆత్మహత్యకు యత్నించారు. తమకు పోలీసులు న్యాయం చేయాలంటూ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు కేంద్రం హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ (Pm Narendra Modi) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల (Social Media) డీపీగా (Display Photo) జాతీయ జెండా ( National Flag)ను పెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తన ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ఖాతాలో ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒక్కసారి గాల్లోకి ఎగిరితే.. చైనా, పాక్‌ సరిహద్దులను చుట్టేస్తుంది..!

చైనా, పాక్‌ సరిహద్దుల వద్ద మోహరింపులను భారత్‌ బలోపేతం చేస్తోంది. తాజాగా వాయుసేన నాలుగు హెరాన్‌ మార్క్‌-2 సాయుధ డ్రోన్లను నార్తన్‌ సెక్టార్‌లోని సరిహద్దు స్థావరాల వద్ద మోహరించింది. ఇవి లాంగ్‌రేంజ్‌ క్షిపణులను కూడా ప్రయోగించగలవు. తాజాగా ఓ ఆంగ్ల వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ డ్రోన్లకు ఉపగ్రహ కమ్యూనికేషన్‌ ఉండటంతో నియంత్రణ మరింత సులభం కానుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గత 100 ఏళ్లలో చూడని ఘోరం : అమెరికా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌

శతాబ్దాల చరిత్ర కలిగిన అమెరికా(USA)లోని హవాయి(Hawaii) దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగరం.. కార్చిచ్చు కారణంగా బూడిద గుట్టగా మారిపోయింది. ఇక్కడ మౌయి దీవిలో మృతుల సంఖ్య తాజాగా 89కి పెరిగింది. ఈ సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అమెరికాలోని ఫైర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లోరీ మూర్‌ మెరిల్లీ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలు

తిరుమల నడక మార్గంలో లక్షిత అనే బాలికపై చిరుత దాడిచేసి ప్రాణాలు తీసిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. చిరుతను బంధించేందుకు అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ చిరుత ముమ్మరంగా సాగుతోంది. బాలికపై చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్‌ కెమెరాలతో చిరుత కదలికలను అటవీశాఖ పర్యవేక్షిస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత జట్టుకు భారీగా నజరానా... మరి అవార్డులు ఎవరికంటే?

 నాలుగోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ (Asian Champions Trophy) విజేతగా భారత హాకీ జట్టు నిలిచింది. ఫైనల్‌లో మలేసియాపై 4-3 తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. జట్టును గెలిపించిన ప్రతి ఆటగాడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.50 లక్షలను నజరానాగా ఇస్తున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ దిలీప్‌ టిర్కే తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా కామెంట్‌ చేశాడు: సమీరారెడ్డి

‘అశోక్‌’, ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటి సమీరారెడ్డి (Sameera Reddy). వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్షయ్‌తో వివాహం, పిల్లలు, తనకు ఎదురైన విమర్శల గురించి మాట్లాడారు. ‘‘2014లో అక్షయ్‌తో నాకు వివాహమైంది. మా ఇంటి టెర్రస్‌పైనే చాలా సింపుల్‌గా మా పెళ్లి జరిగింది. నేను ప్రెగ్నెంట్‌ని అయ్యానని.. అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని పలువురు మాట్లాడుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని