Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Dec 2023 12:33 IST

1. ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. స్తంభించిన చెన్నై

మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరం, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఇప్పటికే చెన్నైలో మోహరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు. భారాస (BRS) ముఖ్యనేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. దీంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. రంకేసిన బుల్‌.. మదుపర్లకు లాభాల పంట

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్లాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ మదుపర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. తాజా ఎన్నికల్లో భాజపా విజయం నేటి బుల్‌ పరుగుకు ప్రధాన కారణంగా నిలిచింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త ముఖం.. ఐపీఎస్‌ నుంచి సీఎం వరకు ‘లాల్‌దుహోమా’..!

ఈశాన్య రాష్ట్రం మిజోరం (Mizoram)లో మూడున్నర దశాబ్దాలుగా వస్తోన్న రాజకీయ సంప్రదాయాన్ని స్థానిక ఓటర్లు ఈసారి పక్కనపెట్టారు. 1989లో రాష్ట్రంగా అవతరించినప్పటినుంచి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌ (Congress)లే పాలించిన మిజోరంలో.. తొలిసారి ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM)’కు అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ల ఆధిపత్యానికి తెరదించుతూ.. ‘జడ్పీఎం’కు అధికారాన్ని కట్టబెట్టిన నేతగా లాల్‌దుహోమా (Lalduhoma) పేరు మార్మోగుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్‌ ఓటమి: మమత

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2023) ఫలితాలపై పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ‘ఇండియా’ (INDIA) కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్‌ (Cogress) ఓటమి పాలైందని అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోల్‌కతాలో మమత విలేకరులతో మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్‌

బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ‘మిగ్‌జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్‌ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఇది ఒక సవాలు లాంటిదని, ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. 200 హమాస్‌ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ సైన్యం

హమాస్‌(Hamas)తో యుద్ధాన్ని పునఃప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతను ఏ మాత్రం తగ్గించలేదు. నిన్న రాత్రి దాదాపు 200 హమాస్‌ లక్ష్యాలపై వైమానిక దళం బాంబింగ్‌ చేసింది. ఐడీఎఫ్‌ దళాలు చేపట్టిన భూతన ఆపరేషన్‌కు మద్దతుగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఐడీఎఫ్‌ స్పందిస్తూ.. తమ నెగెవ్‌ బ్రిగేడ్‌ గాజాలోని పలు హమాస్‌ స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర గాజాలోని బెయిట్‌ హనౌన్‌లో ఉన్న ఓ పాఠశాలలో హమాస్‌ స్థావరాన్ని గుర్తించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక  ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. తీవ్ర తుపానుగా మిగ్‌జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. మంగళవారం ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో ‘మిగ్‌జాం’ తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 110 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. తీరం దాటేంత వరకూ కోస్తాంధ్ర తీరప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో ‘మిగ్‌జాం’ కదలనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కొట్టుకుపోయిన కార్లు.. రన్‌వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung)తో తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని