Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Jun 2023 16:59 IST

1. పార్టీలకు అతీతంగా ఫిర్యాదులు స్వీకరించండి: కేటీఆర్‌

పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో వార్డులో పది మంది అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలుకు మెరుగైన, సులభమైన సేవలు అందిస్తారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తితిదే షెడ్యూల్‌ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్‌ 19న విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తితిదే తెలిపింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీ డిప్‌ కోసం జూన్‌ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాయలసీమ నుంచి ముందుకు కదలని రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో అసాధారణ పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ నుంచి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయి. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని సగానికిపైగా ప్రాంతాల్లో  రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎంపీ కుమారుడిని ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు: డీజీపీ

విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడు కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్నారు. కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం పేరు మార్పు.. మండిపడ్డ కాంగ్రెస్‌

భారత తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) అధికారిక నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్‌ తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. అందులో ఉన్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ (NMML) పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ (Prime Ministers' Museum and Library Society) కేంద్రం నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తృణధాన్యాలపై పాట.. గ్రామీ విజేతతో కలిసి మోదీ రచన, గాత్రం

తృణధాన్యాల (Millets) వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ భారత-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా (ఫాలు) ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ పాటకు భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన సహకారాన్ని అందించారు. గాయని ఫాలుతో కలిసి ఈ గీతాన్ని రచించడంతో పాటు తన గాత్రాన్ని కూడా అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లాక్‌పై కోర్టుకు.. ₹41 లక్షల పరిహారం

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై (Facebook) ఓ వ్యక్తి న్యాయపోరాటానికి దిగాడు. అకారణంగా తన అకౌంట్‌ను (Facebook account) లాక్‌ చేయడమే కాకుండా.. సమస్యేంటో కనుక్కొందామని ఫోన్‌ చేస్తే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో ఫేస్‌బుక్‌పై కోర్టులో దావా వేశాడు. ప్రతిగా రూ.41 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ ₹లక్ష చోరీతో రైల్వేకు సంబంధం లేదు: 18 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పు

రైలు ప్రయాణంలో వ్యక్తి పోగొట్టుకున్న డబ్బుతో రైల్వే (Railway)కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. ఈ కేసులో బాధిత ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలన్న కన్స్యూమర్‌ కోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. ఈ మేరకు 18 ఏళ్ల నాటి కేసులో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కన్నపేగుకు నిరాశ.. ఆ పాప సంరక్షణ బాధ్యతలు జర్మనీకే!

చిన్నారి అరిహా కేసు (Baby Ariha Case)లో ఆమె తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది! ఆ పాప సంరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో జర్మనీ (Germany) అధికారులకే అప్పగిస్తూ బెర్లిన్‌ (Berlin)లోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చిన్నారికి గాయం ప్రమాదవశాత్తుగా అయ్యిందన్న తల్లిదండ్రుల వాదనను తోసిపుచ్చుతూ.. ఆమె ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆఫ్రికా నేతలు సందర్శిస్తున్న సమయంలో కీవ్‌పై క్షిపణి దాడులు..!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంత్రి ప్రక్రియ కోసం చర్చలు జరిపేందుకు ఆఫ్రికా దేశాల నేతలు కీవ్‌కు వచ్చిన సమయంలో భారీగా దాడులు జరిగాయి. ఈ నేతల్లో కొందరు నగరంలో ఉన్న సమయంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. అదే సమయంలో నల్ల సముద్రంపై నుంచి రష్యా పలు కల్బిర్‌ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది. ఇవి ఉత్తర దిశ నుంచి కీవ్‌ వైపు దూసుకొచ్చినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని