Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jun 2023 17:01 IST

1. తెలంగాణలో రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో రెండు రోజులపాటు అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఆసిఫాబాద్, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లా తీసుకొచ్చారు: పవన్‌

నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. వైకాపా నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని పవన్‌ అన్నారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కాంగ్రెస్ అభ్యర్థులకు రూ.వేల కోట్లు ప్యాకెట్‌ మనీ ఇస్తున్నారు: బండి సంజయ్‌

వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్‌ అనుకుంటే సరిపోదని, రాష్ట్ర ప్రజలూ అనుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. డిపాజిట్లు ఏ పార్టీ కోల్పోతుందో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలిచిందని ఆయన గుర్తు చేశారు.  ఈ విషయాన్ని మరిచిపోయి కాంగ్రెస్‌ నేతలు అద్దాల మేడలో ఉంటూ సంతోష పడుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. భాజపా, భారాస బంధం తెగిపోయేది కాదు: రేవంత్‌ రెడ్డి

మంత్రి కేటీఆర్‌ దిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, కల్వకుంట్ల కుటుంబ కంపెనీలపై చేసిన ఐటీ దాడుల్లో దొరికిన రహస్య ఆస్తులను విడిపించుకోవడానికేనని పీసీసీ అద్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాలు మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారన్నారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారాసతో రాజీలేదు.. సీరియస్‌ ఫైటే: జేపీ నడ్డా

నేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పార్టీ లైన్‌ దాటి ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నడ్డాకు రాష్ట్ర భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రధాని మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

ఈజిప్టులో పర్యటిస్తున్న నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ (Order of the Nile) దక్కింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి దీనిని అందజేసి సత్కరించారు. 1915లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని.. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు అందిస్తున్నారు. తాజాగా మోదీకి ఈ పురస్కారం వరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మోదీ పర్యటన భారత్‌-అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధికారిక పర్యటన న్యూదిల్లీ-వాషింగ్టన్‌ సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని భారత్‌(India)లో అమెరికా(USA) రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ అభివర్ణించారు. ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని దాటి స్వచ్ఛమైన స్నేహ బంధంతో ముడిపడిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కిడ్నాప్‌ చేస్తున్నాడని అనుమానించి.. క్యాబ్‌ డ్రైవర్‌పై మహిళ కాల్పులు!

ఓ మహిళ ఆవేశంలో చేసిన పని క్యాబ్‌ డ్రైవర్‌ (Cab Driver) ప్రాణాల మీదకు తెచ్చింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న తనను సదరు డ్రైవర్‌ కిడ్నాప్‌ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై కాల్పులు జరిపింది. దీంతో డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్..!

ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి అదేశించారు. ఈ మేరకు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్‌ దీక్షిత్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వరదలో కొట్టుకుపోయిన కారు.. మహిళను ఎలా కాపాడారో చూడండి..!

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో వర్షాలు (Rains) జోరందుకుంటున్నాయి. ఇప్పటికే.. అస్సాం వరద (Assam Floods)ల్లో చిక్కుకుపోయింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, దిల్లీ తదితర రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అస్సాంలో ఇప్పటికీ వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని