Heavy Rains: వరదలో కొట్టుకుపోయిన కారు.. మహిళను ఎలా కాపాడారో చూడండి..!

దేశవ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటున్నాయి. అస్సాంలో ఇప్పటికి వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. హరియాణాలో వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న ఓ కారులోంచి మహిళను సురక్షితంగా కాపాడారు.

Published : 25 Jun 2023 13:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో వర్షాలు (Rains) జోరందుకుంటున్నాయి. ఇప్పటికే.. అస్సాం వరద (Assam Floods)ల్లో చిక్కుకుపోయింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, దిల్లీ తదితర రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అస్సాంలో ఇప్పటికీ వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. తొమ్మిది జిల్లాల్లో దాదాపు 4 లక్షలకుపైగా ప్రజలు భారీ వర్షాలతో ప్రభావితమయ్యారు.

వర్షాలు కురుస్తోన్న వేళ.. దిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువతి విద్యుదాఘాతంతో మృతి చెందింది. రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకుంటున్న ఆమె.. మధ్యలో నీటి గుంటలను దాటే క్రమంలో ఓ విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకోవడంతో కరెంట్‌ షాక్‌కు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. హరియాణాలో వంతెన కింద వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న కారులోంచి మహిళను సురక్షితంగా కాపాడారు. ఇక్కడి పంచకులలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరోవైపు.. అస్సాంలో 1118 గ్రామాలు నేటికీ వరద నీటిలోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. 101 సహాయక శిబిరాల్లో 81 వేలకుపైగా వరద బాధితులు తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించామని, అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని