Crime News: కిడ్నాప్‌ చేస్తున్నాడని అనుమానించి.. క్యాబ్‌ డ్రైవర్‌పై మహిళ కాల్పులు!

తనను క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఓ మహిళా ప్రయాణికురాలు కాల్పులు జరిపిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

Updated : 25 Jun 2023 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ మహిళ ఆవేశంలో చేసిన పని క్యాబ్‌ డ్రైవర్‌ (Cab Driver) ప్రాణాల మీదకు తెచ్చింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న తనను సదరు డ్రైవర్‌ కిడ్నాప్‌ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై కాల్పులు జరిపింది. దీంతో డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ.. ఎల్‌ పాసో కౌంటీలో ఉన్న మిత్రుడిని కలిసేందుకు ఉబర్‌ క్యాబ్‌లో (Uber Cab) ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తర్వాత హైవేపై ఉన్న బోర్డులను చూసిన ఆమె.. క్యాబ్‌ వేరే మార్గంలో వెళ్తోందని ఆందోళనకు గురయ్యింది. డ్రైవర్‌ తనను కిడ్నాప్‌ చేసి మెక్సికో వైపు తీసుకెళ్తున్నట్లు అనుమానించిన ఆమె.. వెంటనే బ్యాగులో ఉన్న తుపాకీని తీసి అతడిపై కాల్పులు జరిపింది. దీంతో డ్రైవర్‌ మెడకు, చేతికి తీవ్ర గాయాలవడంతో పాటు కారు అదుపుతప్పి ఆగిపోయింది.  ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చేరవేసింది. అదే సమయంలో రక్తపుమడుగులో ఉన్న డ్రైవర్‌ ఫొటోలను తన బాయ్‌ఫ్రెండ్‌కు కూడా పంపించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఉబర్‌ డ్రైవర్‌ ప్రయాణికురాలిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని.. కేవలం అనుమానంతోనే ఆమె కాల్పులు జరిపి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఆమెపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేశారు. దీనిపై ఉబర్‌ యాజమాన్యం కూడా స్పందించింది. ప్రయాణికురాలి తీరును తీవ్రంగా తప్పపట్టింది. ఇదో భయంకరమైన చర్యగా అభివర్ణించింది. తమ సర్వీసుల్లో ఇటువంటి హింసను సహించేది లేదని.. సదురు మహిళపై ఉబర్‌ సేవలను వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు