Revanth reddy: భాజపా, భారాస బంధం తెగిపోయేది కాదు: రేవంత్‌ రెడ్డి

తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు వదిలిపెట్టారని కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

Updated : 25 Jun 2023 18:11 IST

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ దిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, కల్వకుంట్ల కుటుంబ కంపెనీలపై చేసిన ఐటీ దాడుల్లో దొరికిన రహస్య ఆస్తులను విడిపించుకోవడానికేనని పీసీసీ అద్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాలు మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారన్నారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారన్నారు. దిల్లీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని ధ్వజమెత్తారు.

తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. రూ.వంద కోట్లు లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోదీ.. కేసీఆర్‌ అవినీతిపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. నిన్న దిల్లీలో నడ్డాను, అమిత్ షాలను కలిసి వచ్చిన భాజపా నాయకులు భ్రమలు ఏమీ పెట్టుకోవద్దని సూచించారు. భాజపా, భారాస బంధం తెగిపోయేది కాదన్నారు. ఎంత కంఠశోష పెట్టుకున్నా వారి మాట ఎవరూ వినరని, తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని