Pawan Kalyan: పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లా తీసుకొచ్చారు: పవన్‌

నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు.

Updated : 25 Jun 2023 14:19 IST

రాజోలు: నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. 

వైకాపా నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని పవన్‌ అన్నారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని వ్యాఖ్యానించారు. వైకాపా చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనని చెప్పారు. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకున్నట్లు వివరించారు. తమ పార్టీ ఓడిన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయమన్నారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

‘‘కుల, మత ప్రస్తావన రెచ్చగొట్టేందుకు కాదు. కుల సర్దుబాటు కోసమే కులప్రస్తావన తీసుకొచ్చాను. రాజోలు విజయం జనసేనకు ఊపిరి పోసింది.  రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలి. ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతా.. ఎదురుతిరుగుతా. ₹200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది. ₹వేల కోట్లు దోపిడీ చేసే నేతలు పరిపాలన చేస్తున్నారు. మన ఓట్లు తీసేస్తారు.. దొంగ ఓట్లు వేస్తారు.. జాగ్రత్త. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే కుదరదు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ప్రజలు రీకాల్‌ చేయాలి. రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలి. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలి. వచ్చే ఎన్నికలు మార్పునకు సంకేతం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని