Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Jun 2023 17:00 IST

1. ఇది రాష్ట్రమా.. రావణ కాష్ఠమా?: చంద్రబాబు

రాష్ట్రంలో జరిగిన వరుస దుర్ఘటనలపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఇది రాష్ట్రమా..? రావణ కాష్ఠమా?’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి ప్రశ్నిస్తూ వీడియో రిలీజ్ చేశారు. నాలుగేళ్ల నరకమంటూ ఇప్పటివరకూ జరిగిన ఘటనల్ని ఇందులో ఉదహరించారు. పదో తరగతి విద్యార్థి సజీవదహనం, ఏలూరు యాసిడ్‌ దాడిపై సీఎం జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదు: నడ్డా వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

నాగర్‌కర్నూల్‌ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉప్పల్‌ స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. నిన్న భాజపా సభలో నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిపోయారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. గోదావరి జిల్లాల్లో ఒక్క సీటూ వైకాపాకు రానివ్వను: పవన్‌

గోదావరి జిల్లాల అభివృద్ధితోపాటు కాలుష్య నివారణకు మాస్టర్‌ ప్లాన్ తీసుకొస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కొద్దిమంది చేతుల్లోనే విద్య, వైద్యం ఉండకూడదన్న పవన్‌.. అధికారంలోకి రాగానే అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నడ్డా... ఇది కేసీఆర్ అడ్డా: మంత్రి వేముల

తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ భాజపా నేతలు ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్మే మాటలే చెబుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. పదే పదే అవే పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని ప్రశ్నించారు. నాగర్‌ కర్నూల్‌ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ₹ 2 వేల నోటు ఉపసంహరణ.. ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు: ఆర్‌బీఐ గవర్నర్‌

రూ. 2 వేల నోటు ఉపసంహరణ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 2.41 లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు వెనక్కి వచ్చేశాయని వెల్లడించారు. ‘‘రూ. 2 వేల నోటు ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. 15కి.మీల ట్రాఫిక్‌ జామ్‌.. హోటల్స్‌ ఫుల్‌.. పర్యాటకులకు నరకయాతన!

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని మండీ జిల్లాలో ఆకస్మిక వరదలు పర్యాటకులకు  పీడకలగా మారాయి. ఓవైపు, భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలకు తోడు అక్కడి పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో భయానక వాతావరణం నెలకొంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ-కుల్లు ; మనాలి-చండీగఢ్‌ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అక్కడి ఆలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌..! ఇప్పటికే 130 చోట్ల అమల్లోకి

మహారాష్ట్రలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నారా..! అయితే, మీ వస్త్రధారణపై దృష్టి సారించుకోవాల్సిందే. ఎందుకంటే.. దైవదర్శన సందర్భంగా భక్తులకు సరైన వస్త్రధారణ నిబంధనలు అమలు చేసే దిశగా ఆలయాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడుకునేందుకుగానూ ‘మహారాష్ట్ర మందిర్‌ మహాసంఘ్‌ ’ ఈ మేరకు విస్తృత ప్రచారం చేపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. పుతిన్‌తో వైరం పెట్టుకొన్నాడు.. తెరిచిన కిటికీల వద్ద ప్రిగోజిన్‌ జాగ్రత్తగా ఉండాలి: సీఐఏ హెచ్చరిక

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్‌ అధిపతి ప్రిగోజిన్‌కు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్‌ డేవిడ్‌ పేట్రాయస్‌ హెచ్చరించారు. ముఖ్యంగా తెరిచిన కిటికీల వద్ద ప్రిగోజిన్‌ చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. గతంలో పుతిన్‌ విరోధులు చాలా మంది ఇలా తెరిచిన కిటికీల్లో నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నెరవేరని మిలియనీర్‌ కల.. ఆ పోటీ పరీక్షలో 27వ సారి ఫెయిల్‌..!

వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తూ.. ఓ పరీక్షలో మాత్రం వరుస డింకీలు కొడుతున్నాడో మిలియనీర్‌. చైనాకు చెందిన ఆయన 56 ఏళ్ల వయస్సులోనూ 27వ సారి పరీక్ష రాశాడు. ఈ సారి కూడా ఆయన ఏళ్ల నాటి కల నెరవేరలేదు. ఆ చైనా మిలియనీర్ పేరు లియాంగ్‌ షీ. చైనాలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష ‘గావోకావో’లో ఉత్తీర్ణత సాధించి, ప్రతిష్ఠాత్మక సిచువాన్ విశ్వవిద్యాలయంలో చేరాలనేది ఆయన కల. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పెట్రోల్‌కు టాటా.. ఇక పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలు: గడ్కరీ

చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణానికి మేలు చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపి వినియోగించడాన్ని కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తోంది. దీనివల్ల రైతులకూ అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం 20 శాతం ఇథనాల్‌ను కలిపి పెట్రోల్‌నూ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలను భవిష్యత్‌లో తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని