Himachal landslide: 15కి.మీల ట్రాఫిక్‌ జామ్‌.. హోటల్స్‌ ఫుల్‌.. పర్యాటకులకు నరకయాతన!

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లులో భారీ వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో అనేకమంది పర్యాటకులు చిక్కుకుపోయారు. రహదారులు మూసివేయడంతో రాత్రంతా వాహనాల్లోనే భయంతో పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Published : 26 Jun 2023 15:37 IST

సిమ్లా/మండీ: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని మండీ జిల్లాలో ఆకస్మిక వరదలు పర్యాటకులకు  పీడకలగా మారాయి. ఓవైపు, భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలకు తోడు అక్కడి పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో భయానక వాతావరణం నెలకొంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ-కుల్లు ; మనాలి-చండీగఢ్‌ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దాదాపు 200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయి నిన్న సాయంత్రం నుంచి రోడ్డుపైనే నరకయాతన పడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.  ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో పర్యాటకులు, అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భారీ వర్షాలకు తోడు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో హైవేపై నిన్న సాయంత్రం నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా పడిన బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  ఏడెనిమిది గంటల తర్వాతే వాహనాలు ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  దీంతో నిన్నటి నుంచి రహదారులపైనే వాహనదారులు, పర్యాటకులు పడిగాపులు కాస్తున్నారు.  భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కొందరు పర్యాటకులు తమ ఆవేదనను మీడియాతో చెప్పుకొన్నారు. మండీ, సుందర్‌నగర్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో.. ఆదివారం రాత్రి  10గంటల సమయంలో పోలీసులు తమ వాహనాలను నిలిపివేశారని.. వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారని తెలిపినట్టు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు 15కి.మీల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయినట్టు చెబుతున్నారు. 

ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదని.. చిక్కుకుపోయిన వాహనాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. కొందరు మొత్తం బస్సులను బుక్‌ చేసుకొని రాగా.. ఇంకొందరు దాబాల వద్ద వేచి చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరికీ హోటళల్లో గదులు దొరకకపోవడంతో పిల్లల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారన్నారు. నిన్న సాయంత్రం 5గంటల నుంచి జాతీయ రహదారిని మూసివేసినా ఇప్పటికీ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయలేదని మరికొందరు పర్యాటకులు చెబుతున్నారు. వాహనాలు ఎప్పుడు ముందుకు కదులుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ రహదారిపై చిక్కుకుపోయిన పర్యాటకుల పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో వచ్చే రెండు  రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ స్థానిక వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరికలు జారీచేయడం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని