Wagner chief: పుతిన్‌తో వైరం పెట్టుకొన్నాడు.. తెరిచిన కిటికీల వద్ద ప్రిగోజిన్‌ జాగ్రత్తగా ఉండాలి: సీఐఏ హెచ్చరిక

పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌ ప్రాణాలకు భయంకరమైన ముప్పు పొంచిఉందని సీఐఏ హెచ్చరించింది.  

Published : 26 Jun 2023 16:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్‌ అధిపతి ప్రిగోజిన్‌కు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్‌ డేవిడ్‌ పేట్రాయస్‌ హెచ్చరించారు. ముఖ్యంగా తెరిచిన కిటికీల వద్ద ప్రిగోజిన్‌ చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. గతంలో పుతిన్‌ విరోధులు చాలా మంది ఇలా తెరిచిన కిటికీల్లో నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రష్యాలో పరిణామాలపై డేవిడ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రిగోజిన్‌ ఆవేశంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. అతడి ప్రాణాలను కాపాడుకొన్నాడు.. కానీ, వాగ్నర్‌ గ్రూప్‌ను పోగొట్టుకొన్నాడు. అతడు ఇప్పుడు వెళుతున్న బెలారస్‌లో కొత్త పరిసరాల్లో తెరుచుకొని ఉన్న కిటికీల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. 

గతేడాది ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన ఫిబ్రవరి 24 నాటి నుంచి డిసెంబర్‌ వరకు రష్యాకు చెందిన 19 మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక వీరి మృతికి కారణాలు తెలియరాలేదు. కొందరు కుటుంబసభ్యులుతో సహా మరణించారు. రష్యా(Russia) అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. క్రెమ్లిన్‌కు ఎదురు నిలిచిన వారు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సోవియట్‌, రష్యా(Russia) చరిత్రలో చాలా చోటు చేసుకొన్నాయి. చాలా సందర్భాల్లో కిటికిల్లోంచి దూకి చనిపోయిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఉద్దేశించే సీఐఏ చీఫ్‌ డేవిడ్‌ వాగ్నర్‌ అధిపతి ప్రిగోజిన్‌ను హెచ్చరించారు. తిరుగుబాటు చేసిన నేతను పుతిన్‌ అంత సులభంగా వదలరనీ, బెలారస్‌లోనే మట్టుబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రష్యా పరిణామాలను గమనిస్తున్న సీనియర్‌ పాత్రికేయురాలు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని