KTR: కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదు: నడ్డా వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

నాగర్‌కర్నూల్‌ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 26 Jun 2023 15:35 IST

హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉప్పల్‌ స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘నిన్న సభలో నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిపోయారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామంటున్నారు.. అది ఎందుకో చెప్పాలి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ అందిస్తున్నందుకా? కేసీఆర్‌ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్‌? మాట్లాడడానికి ఓ హద్దు అదుపు ఉండాలి. ఈ 23 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదు’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ కష్టాలు ఉన్నాయని.. ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు. వేసవి కాలంలో నీటి కొరత సమస్య లేకుండా ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్‌ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు.  

అవినీతిపై రేవంత్‌ మాట్లాడితే.. పులి శాకాహారం గురించి చెప్పినట్లే..

కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారని.. దానికి సోనియాగాంధీ కారణం కాదా? అని ప్రశ్నించారు. అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్లు.. హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. రూ.50లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా? అని ప్రశ్నించారు. 9 ఏళ్లలో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలంతా గమనించాలని కేటీఆర్‌ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని