Shaktikanta Das: ₹ 2 వేల నోటు ఉపసంహరణ.. ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు: ఆర్‌బీఐ గవర్నర్‌

రూ. 2 వేల నోటు ఉపసంహరణ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 2.41 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు వెనక్కు వచ్చాయని తెలిపారు.

Published : 26 Jun 2023 15:59 IST

ముంబయి: రూ. 2 వేల నోటు ఉపసంహరణ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) అన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 2.41 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చేశాయని వెల్లడించారు. ‘‘ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదల్చుకున్నా. రూ. 2 వేల నోటు ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతకముందు, చలామణీ నుంచి రూ. 2 వేల నోటును వెనక్కు తీసుకోవడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థతోపాటు, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన నివేదికలో పేర్కొంది. 

క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా  మే 19న రూ. 2వేల నోట్ల చలామణీని వెనక్కి తీసుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబరు 30 నాటికి వినియోగదారులు తమ వద్దనున్న రూ. 2 వేల నోట్లను బ్యాంక్‌లో మార్చుకోవడం లేదా డిపాజిట్‌ చేయాలని సూచించింది. అయితే, వాటి చెల్లుబాటును నిషేధించలేదు కనుక, రోజువారీ అవసరాలకు వినియోగించుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను కొందరు కొనుగోళ్లకు వినియోగిస్తుండగా, మరికొందరు బ్యాంకులకు వచ్చి, వేరే నోట్లలోకి మారుస్తున్నారు. మరికొందరు ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. అలా, ఇప్పటి వరకు 72% వరకు రూ. 2 వేల నోట్లు వెనక్కు వచ్చేసినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని