Vemula Prashanth reddy: నడ్డా... ఇది కేసీఆర్ అడ్డా: మంత్రి వేముల

నాగర్‌ కర్నూల్‌ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇక్కడి భాజపా నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని ప్రశ్నించారు.

Updated : 26 Jun 2023 14:52 IST

హైదరాబాద్‌: తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ భాజపా నేతలు ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్మే మాటలే చెబుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. పదే పదే అవే పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని ప్రశ్నించారు. నాగర్‌ కర్నూల్‌ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

‘‘నడ్డా.. ఇది కేసీఆర్‌ అడ్డా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా? రెండు పడక గదుల ఇళ్ల కోసం మేం రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టాం. వీటికి కేంద్రం కొసిరి కొసిరి ఇచ్చింది కేవలం రూ.1200 కోట్లే. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు, అభివృద్ధి పనులకు కేంద్రంలోని భాజపా సర్కారు పైసలివ్వకున్నా.. అవార్డులు ఇస్తుంది తెలుసా? కేసీఆర్ రైతుబంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు షరతులు విధించడం సిగ్గు చేటు. ధరణిని రద్దు చేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనే ఆలోచన భాజపాది. కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్‌’ అని రైతులకు ఆసరాగా నిలబడితే.. భాజపా అరిగోస పెడుతోంది. పేదలు, రైతులు రెండు కళ్లుగా పని చేస్తున్న కేసీఆర్‌ని జైల్లో పెడతారా? పంచభూతాలను అమ్మకానికి పెట్టి, దేశ సంపద మిత్రులకు దోచి పెడుతున్న నరేంద్ర మోదీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి?’’ అని మంత్రి వేముల విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని