Chandrababu: ఇది రాష్ట్రమా.. రావణ కాష్ఠమా?: చంద్రబాబు

‘నాలుగేళ్ల నరకం’ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

Updated : 26 Jun 2023 15:54 IST

అమరావతి: రాష్ట్రంలో జరిగిన వరుస దుర్ఘటనలపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఇది రాష్ట్రమా..? రావణ కాష్ఠమా?’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి ప్రశ్నిస్తూ వీడియో రిలీజ్ చేశారు. నాలుగేళ్ల నరకమంటూ ఇప్పటివరకూ జరిగిన ఘటనల్ని ఇందులో ఉదహరించారు. పదో తరగతి విద్యార్థి సజీవదహనం, ఏలూరు యాసిడ్‌ దాడిపై సీఎం జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నం అత్యాచార ఘటనలపైనా నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కనీస సమీక్ష కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. నిజంగా జగన్‌ ప్రజల బిడ్డే అయితే.. దాడులు చేసిన సొంత పార్టీ నేతల్ని కాపాడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల బిడ్డే అయితే.. పేదల ప్రాణాలకు వెలకట్టే పెత్తందారు అయ్యేవారా? అని నిలదీశారు.  

రానున్న రోజుల్లో గల్లీ నుంచి పట్టణాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైకాపా నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ‘నాలుగేళ్ల నరకం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం దాదాపు నెల రోజుల పాటు సాగుతుందని చెప్పారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత నాలుగేళ్లుగా వైకాపా పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. ప్రచార కార్యక్రమంలో వివిధ రంగాలవారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, 40ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ.. ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని