నెరవేరని మిలియనీర్‌ కల.. ఆ పోటీ పరీక్షలో 27వ సారి ఫెయిల్‌..!

ఒకవైపు వ్యాపారంలో రాణిస్తూ.. మరోవైపు తాను కోరుకున్న విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ప్రయత్నించాడో మిలియనీర్(Chinese Millionaire). అయితే ఆయన ప్రయత్నాలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన స్టోరీ వైరల్‌గా మారింది. 

Updated : 26 Jun 2023 16:48 IST

బీజింగ్‌: వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తూ.. ఓ పరీక్షలో మాత్రం వరుస డింకీలు కొడుతున్నారో మిలియనీర్‌. చైనా(China)కు చెందిన ఆయన 56 ఏళ్ల వయస్సులోనూ 27వ సారి పరీక్ష రాశారు. ఈ సారి కూడా ఆయన ఏళ్ల నాటి కల నెరవేరలేదు. ఇంతకీ విషయం ఏంటంటే..?

ఆ చైనా మిలియనీర్(Chinese Millionaire) పేరు లియాంగ్‌ షీ(Liang Shi). చైనా(China)లో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష ‘గావోకావో’(gaokao)లో ఉత్తీర్ణత సాధించి, ప్రతిష్ఠాత్మక సిచువాన్ విశ్వవిద్యాలయంలో చేరాలనేది ఆయన కల. కానీ అందుకోసం ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర జేఈఈ మాదిరిగానే ఆ పోటీ పరీక్ష కూడా కఠినతరమైంది. ఇప్పటికి లియాంగ్ 27 సార్లు దానికి హాజరయ్యారు. కానీ ఈ సారి కూడా ఆయన ప్రయత్నం ఫలించలేదు. ‘ఈ పరీక్షలో ఉత్తీర్ణత కోసం గత కొంతకాలంగా ఎన్నో త్యాగాలు చేశాను. ఒక సన్యాసిలా జీవిస్తూ.. నా దృష్టి అంతా పరీక్ష మీదే పెట్టాను’ అని ఆయన వెల్లడించారు. అయినా అర్హత మార్కులకు 34 పాయింట్లు తగ్గడంతో లియాంగ్‌కు ఈసారీ నిరాశే ఎదురైంది.

ఫలితాలకు ముందే తనకు తగిన స్కోర్‌ రాదని లియాంగ్‌కు అనిపించిందట. తాను అనుకున్న విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ఎన్నిసార్లైన ప్రయత్నిస్తానని గట్టిగా చెప్పే ఆయన.. ఈసారి మాత్రం నమ్మకం కోల్పోయినట్లు కనిపించారు. ‘మెరుగవుతానని నమ్మకం లేనప్పుడు మళ్లీ మళ్లీ ప్రయత్నించడంలో అర్థం లేదు. వచ్చే ఏడాది ఈ పరీక్ష రాస్తానో లేదో చెప్పడం కష్టం. అయితే గావోకావోకు సిద్ధం కాకుండా ఉండే పరిస్థితిని నేను ఊహించలేను. అది నాకెంతో బాధకలిగించే విషయం’ అని లియాంగ్ వెల్లడించారు. అయితే ఆయన ప్రయత్నాలను కొందరు పబ్లిక్ స్టంట్ అని విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆయన.. ప్రస్తుతం కాస్త నిరాశలోకి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని