Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 May 2024 17:00 IST

1. ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్‌ కేంద్రాలు

 రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం’’ అని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్‌

పింఛన్‌ల పంపిణీపై జగన్‌ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పింఛన్‌ డబ్బు జమ కాకపోవడంతో లబోదిబో మంటున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!

అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. నాలుగు కంటైనర్లలో రూ.2వేల కోట్లు ఉన్నాయని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది.  నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్‌ చేస్తూ.. భానుకిరణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కింది  కోర్టు ఆదేశాలను సమర్థించింది. భానుకిరణ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. పోలింగ్‌ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి

 ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఈసీకి లేఖ రాశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్‌.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్‌కీబాత్‌ కుర్రాడు..!

కొన్నేళ్ల క్రితం ఓ కుర్రాడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. ఇటీవల అతడు తన భార్యతో కలిసి హోలీ కార్యక్రమంలో ఉండగా  అతడికి ఎంపీ టికెట్‌ ఖాయమైనట్లు తెలిసింది. హఠాత్తుగా శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో ఏమిటా అని చూడగా.. తనకు ఎంపీ టికెట్‌ వచ్చినట్లు తెలిసి ఆశ్చర్యపోయాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘కాలా పత్తర్‌’లో.. బిహారీ బాబు-సర్దార్‌జీల పోరు

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోన్న భాజపా.. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసన్‌సోల్‌ స్థానంపై దృష్టిసారించింది. నల్ల బంగారానికి (బొగ్గు గనులకు) నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఈవెంట్‌ ప్లాన్‌ చేయొచ్చు!

వాట్సప్‌ కమ్యూనిటీ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గ్రూప్ మెసేజ్‌లలో ఈవెంట్‌లను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి వాట్సప్‌ (WhatsApp) కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. తద్వారా స్నేహితులు, స్కూళ్లు, సన్నిహితులతో వర్చువల్, వ్యక్తిగత సమావేశాలను సెటప్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అఘాయిత్యం’ - రాహుల్‌ సంచలన ఆరోపణ

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)పై రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వారి వీడియోలు చిత్రీకరించాడని అన్నారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది: నితిన్‌ గడ్కరీ

 ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని