‘400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అఘాయిత్యం’ - రాహుల్‌ సంచలన ఆరోపణ

హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Published : 02 May 2024 16:41 IST

శిమమొగ్గ: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)పై రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వారి వీడియోలు చిత్రీకరించాడని అన్నారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శివమొగ్గలో జరిగిన ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రజ్వల్‌ను మాస్‌ రేపిస్ట్‌ (Mass Rapist)గా పేర్కొన్నారు.

‘ప్రజ్వల్‌ రేవణ్ణ 400 మంది మహిళలపై అఘాయిత్యానికి (Rape) పాల్పడి, వారి వీడియోలు చిత్రీకరించాడు. ఇది సెక్స్‌ కుంభకోణం కాదు. ఇది అతిపెద్ద అత్యాచార ఘటన (Mass Rape). ఓట్ల గురించి వాళ్లు (భాజపా కూటమి) అడుగుతున్నప్పుడు ప్రజ్వల్‌ ఏం చేశాడో ప్రతీ మహిళ తెలుసుకోవాలి. అతడి గురించి ప్రధానికి ముందే తెలుసు. అటువంటి వ్యక్తికి కర్ణాటక వేదికగా మోదీ మద్దతు పలికారు’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

హాసన సెక్స్‌ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే

ప్రజ్వల్‌ ఒక మాస్‌ రేపిస్ట్‌ అని భాజపాకు చెందిన ప్రతీఒక్క నేతకు తెలుసునని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అయినప్పటికీ అతడికి మద్దతు పలకడమే కాకుండా అతడి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అటువంటి వ్యక్తికి ప్రచారం చేసినందుకు గాను దేశంలో ప్రతీ మహిళకు ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా భాజపా నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక దౌర్జన్యం అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటుచేసింది. కేసు విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దర్యాప్తు బృందం.. ఆయనపై తాజాగా లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని