Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 12 Apr 2024 17:00 IST

1. సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు

దిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈనెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పర్చాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు

తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్‌ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఆ వీడియో పెట్టి రెచ్చగొడతారా..? తేజస్వి ఫిష్ మీల్‌పై మోదీ ఫైర్‌

 ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) చేప వీడియోపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. వసంత నవరాత్రి సమయంలో ఇదేంటని పలువురు భాజపా నేతలు ప్రశ్నించారు. తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతన వాదని’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు.  ఈ వీడియోపై ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మనసు బాగోలేదా అయితే సెలవు తీసుకోండి..

చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్‌ (సూపర్ మార్కెట్) వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ యు డాంగ్లాయ్(Yu Donglai) తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల లీవ్‌ ఆఫర్‌ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు కోరవచ్చు. ఈ లీవ్‌ను మేనేజ్‌మెంట్‌ కుదరదని చెప్పడానికి వీల్లేదని షరతు కూడా విధించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికా ద్రవ్యోల్బణ గణంకాల ప్రభావం.. భారీ నష్టాల్లో మన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో అంచనాలు మించి ద్రవ్యోల్బణం నమోదు కావడడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందన్న ఆశలపై ద్రవ్యోల్బణ గణాంకాలు నీల్లు చల్లాయి. దీనికితోడు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాలకు మొగ్గు చూపడం వంటి కారణాలతో మన సూచీలు పతనమయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఇంకా 3 రోజులే ఛాన్స్‌.. మీ ఫోన్‌లోనే ఓటరుగా నమోదు చేసుకోండిలా!

సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్క పౌరుడినీ భాగస్వాముల్ని చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) చర్యలు తీసుకుంటోంది. ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారికి ఇచ్చిన అవకాశం మరో మూడు రోజుల్లోనే (ఏప్రిల్‌ 15తో) ముగియనుంది. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, 2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారందరూ కొత్తగా ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేయించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ప్రజలు నమ్మి అధికారమిస్తే హంతకుడిని కాపాడతారా?: వైఎస్‌ షర్మిల

రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘రాజశేఖర్‌ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. ఆయన గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. నేటి వరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. వారంతా యథేచ్ఛగా తిరుగుతున్నారు’’ అని షర్మిల అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. చంద్రబాబు నివాసంలో ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, మాజీ మంత్రి సిద్దార్థనాథ్‌ సింగ్‌లు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఇకపై పాత ఫోన్‌ పార్ట్స్‌తో ఐఫోన్‌ రిపేర్‌!

 ఐఫోన్‌ (iPhone) రిపేర్‌ ప్రక్రియను ఎట్టకేలకు యాపిల్‌ సులభతరం చేయనుంది. పాత ఫోన్లలోని విడి భాగాలతో మరమ్మతులు చేసుకునేందుకు త్వరలో అనుమతించనున్నట్లు గురువారం ప్రకటించింది. వీటి వాడకం వల్ల రిపేర్‌ చేసిన ఫోన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, ఈ మార్పును కొన్ని మోడళ్లకు మాత్రమే అనుమతించనుంది. అవేంటనేది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్‌ తోటకూర

అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర (Gopichand Thotakura) రికార్డు సృష్టించనున్నారు. ‘బ్లూ ఆరిజిన్‌’ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్‌’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లనున్నారు. 1984లో రాకేశ్‌ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్‌ టూరిస్ట్‌గా తాజాగా గోపీచంద్‌ (Gopichand Thotakura) చరిత్ర సృష్టించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని