YS Sharmila: ప్రజలు నమ్మి అధికారమిస్తే హంతకుడిని కాపాడతారా?: వైఎస్‌ షర్మిల

రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు.

Updated : 12 Apr 2024 13:38 IST

పులివెందుల: రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘రాజశేఖర్‌ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. ఆయన గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. నేటి వరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. వారంతా యథేచ్ఛగా తిరుగుతున్నారు. అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. డబ్బు లావాదేవీలు సహా అన్ని సాక్ష్యాలను సీబీఐ బయటపెట్టింది. 

సాక్షాత్తూ సీఎం జగన్‌ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారు. హంతకులను కాపాడటం న్యాయమా? సొంత చిన్నాన్న కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకుడిని కాపాడతారా? నేటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్‌ను జైలుకు పంపలేదు. మళ్లీ అదే హంతకుడికి టికెట్‌ ఇస్తారా? ఒకవైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరోవైపు హంతకుడు ఉన్నాడు. ఒకవైపు న్యాయం.. మరోవైపు అధికారం ఉన్నాయి. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్నా.. ఆశీర్వదించండి’’ అని షర్మిల కోరారు. 

మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. షర్మిల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘‘కరవు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా?నీళ్లు తేవడానికి ఏం కృషి చేశారో చెప్పాలి. ఓటు వేసే ముందు ఆలోచించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలి’’ అని సునీత అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని