Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 May 2024 16:59 IST

1. ఓటమి తర్వాత.. ఈవీఎంలపై నిందలే : అమిత్‌ షా

కాంగ్రెస్‌ (Congress), సమాజ్‌వాదీ పార్టీ (SP)లపై కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. పూర్తి కథనం

2. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా.. దిల్లీ సర్కార్‌ నిర్ణయం

దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత, పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. నీటి వృథాపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ తెలిపారు. పూర్తి కథనం

3. తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తి కథనం

4. ఆర్మీ ఉద్యోగికి కేటాయించిన స్థలంపై వివాదం.. ఉద్రిక్తత

సైనిక ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్మీ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు యత్నించడంతో వివాదం మరింత ముదిరింది. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పూర్తి కథనం

5. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా.. చిరును కలిసిన అజిత్‌

ఆ కుర్రాడు అప్పుడే హీరోగా తెలుగులో పరిచయమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా. ఆ మూవీ ప్రారంభం సందర్భంగా దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి (Chiranjeevi) వచ్చి తన అభినందనలు తెలిపారు. హీరో-హీరోయిన్లతో కలిసి ఫొటో కూడా దిగారు. ఆ సినిమా ‘ప్రేమ పుస్తకం’.  పూర్తి కథనం

6. ప్రియాంకా- నిక్‌ జొనాస్‌ల ఏజ్‌ గ్యాప్‌.. మధు చోప్రా ఏమన్నారంటే!

నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), ఆమె భర్త నిక్‌ జొనాస్‌ కంటే వయసులో పెద్దదనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పదేళ్ల తేడా ఉంది. ఇదే విషయంపై తాజాగా ప్రియాంక తల్లి మధుచోప్రా (Madhu Chopra) మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉంటున్నప్పుడు వయసు వ్యత్యాసం పెద్ద విషయమేమీ కాదన్నారు. పూర్తి కథనం

7. భారీ రేటు.. ఈసారి కథ మారింది

ప్రీమియర్ లీగ్‌ వేలంలో అత్యధిక ధరలు దక్కించుకునే ఆటగాళ్లు రేటుకు తగ్గ ప్రదర్శన చేసిన దాఖలాలు దాదాపుగా కనిపించవు. గత సీజన్లో రూ.18.5 కోట్లతో రికార్డు రేటు పలికిన సామ్ కరన్‌తో మొదలుపెడితే ప్రతి సీజన్లోనూ భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లలో దాదాపు అందరూ నిరాశపరిచినవాళ్లే. ఇలా రికార్డు రేటు పలికిన ఆటగాళ్ల మీద భారీ అంచనాలు ఏర్పడతాయి. పూర్తి కథనం

8. ఓపెన్‌ఏఐ సీఈఓ కీలక ప్రకటన.. సగానికి పైగా సంపద దాతృత్వానికే

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (OpenAI CEO Sam Altman) గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా బిలియనీర్ల ర్యాంక్‌ జాబితాలో చేరిన ఆయన.. తన సంపదలో పెద్ద మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇస్తానని ప్రకటించారు. పూర్తి కథనం

9. వాహనదారులపైకి దూసుకెళ్లిన బ్రిజ్‌భూషణ్‌ తనయుడి కాన్వాయ్‌.. ఇద్దరు మృతి

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Singh) పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.  పూర్తి కథనం

10. పార్కింగ్‌లో ఉన్న విమానాన్నే విసిరికొట్టేంత గాలి..!

అమెరికా(USA)లోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. వీటి బీభత్సానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్‌  737-800 విమానమే ఈ గాలి దెబ్బకు కదిలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ అందులో లేరు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని