Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Apr 2024 17:00 IST

1. సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మూడు నెలల్లో భారాస దుకాణం బంద్‌: మంత్రి కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్‌ అవుతుందని.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోదీ వేవ్ లేదట.. వివాదంలో భాజపా అభ్యర్థి నవనీత్‌ రాణా

‘మోదీ వేవ్‌ లేదు’ అంటూ భాజపా అభ్యర్థి నవనీత్ రాణా అన్నట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని తన సిటింగ్‌ నియోజకవర్గం అమరావతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇదికాస్తా ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమేఠీ నుంచి పోటీపై రాహుల్‌ గాంధీ ఏం చెప్పారంటే..?

ఐదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీ నియోజకవర్గం నుంచి ఈసారి అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారా..?అనే ప్రశ్నకు ఆయన నుంచే సమాధానం వచ్చింది. ‘పార్టీకి చెందిన సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ (CEC), కాంగ్రెస్ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా నేను వ్యవహరిస్తాను. ఆ నిర్ణయాలు సీఈసీలో తీసుకుంటారు’’ అని రాహుల్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యంగ్‌ ఇండియాది విరాట్‌ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్‌ రాజన్‌

డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్‌ పొందలేకపోతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. యంగ్‌ ఇండియా మనస్తత్వాన్ని విరాట్‌ కోహ్లీతో పోల్చారు. పరోక్షంగా కోహ్లీలా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలనుకుంటున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మీటింగ్‌లో నోట్స్‌ రాయడం స్టీవ్‌ జాబ్స్‌కు నచ్చదట.. ఎందుకో తెలుసా?

మీటింగ్‌ సమయంలో చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాలను పేపర్‌పై నోట్‌ చేసుకోవడం చాలామందికి ఉండే అలవాటు. ఇదొక మంచి అలవాటని చాలామంది భావిస్తారు. కాని, దీనికి యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ పూర్తి వ్యతిరేకమట. మీటింగ్‌ సమయంలో నోట్స్‌ రాసుకోవడం ఆయనకు అసలు నచ్చదట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దూకుడైన బ్యాటింగ్‌తోనే కప్‌ కొట్టగలం..: రికీ పాంటింగ్‌

ఐపీఎల్ 17వ సీజన్‌లో జట్టు గెలవాలంటే దూకుడైన బ్యాటింగ్‌ అవసరమని ఆసీస్‌ మాజీ కెప్టెన్, దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు. ఇవాళ గుజరాత్‌తో దిల్లీ తలపడనున్న నేపథ్యంలో రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్‌ 17 నిమిషాలు ఆలస్యం

జపాన్‌ బుల్లెట్‌ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. అలాంటిది నగోయా-టోక్యో మధ్య ప్రయాణించిన ఒక షింకాన్‌సెన్‌ రైలు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యమైంది. ఈ అరుదైన ఘటనకు ఓ పాము కారణమైంది..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్‌ సీడింగ్‌ కారణమా?

తీవ్ర ఎండలు, పొడి వాతావరణంతో ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వానలకు దుబాయ్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈతరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల అంచనా. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్‌ సీడింగ్‌’ కారణమనే అభిప్రాయాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని