Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 01 Apr 2023 20:53 IST

1. చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ముందస్తుకు తాము సిద్ధంగా లేమని జగన్‌ భావిస్తే అది పగటికలే అవుతుందని చెప్పారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వైకాపాలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు

నగరంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డేటా చోరీ కేసు.. వినయ్‌ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మరింత లోతుగా శోధిస్తోంది. డేటా చోరీ కేసులో మరొక నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్టు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. కోల్‌కతాపై పంజాబ్‌ విజయం..

ఐపీఎల్‌-16 (IPL)  సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ శుభారంభం చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా తడబడింది. 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేటి నుంచే మహిళా సమ్మాన్‌ పొదుపు పథకం.. పోస్టాఫీసుల్లో అందుబాటులోకి

'ఆజాదీకా అమృత్‌ మహోత్సవం'లో భాగంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని 2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Mahila Samman Savings Certificates )’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం నేటి (ఏప్రిల్‌ 1) నుంచి అందుబాటులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జీఎస్టీ రికార్డ్‌.. రెండోసారి ₹1.60లక్షల కోట్లు దాటిన వసూళ్లు

వస్తు సేవల పన్ను వసూళ్లు (GST revenue )  మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. గతేడాది మార్చి నెల వసూళ్లతో పోలిస్తే ఈ వసూళ్లలో 13శాతం వృద్ధి నమోదైంది. కాగా.. జీఎస్‌టీ (GST)ని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఈ వసూళ్లు రూ.1.60లక్షల కోట్లు దాటడం ఇది రెండోసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చాట్‌జీపీటీపై నిషేధం విధించిన ఇటలీ..

ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ(ChatGPT) గురించే చర్చ. చాట్‌జీపీటీ అనేది కృత్రిమ మేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్. టెక్‌ రంగంలోకి దీని ప్రవేశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐరోపా దేశం ఇటలీ(Italy) ఈ అప్లికేషన్‌పై నిషేధం విధించింది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఇటలీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దానిని బ్లాక్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్‌ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!

మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న పంజాబ్‌ (Punjab) కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) విడుదలయ్యారు. గతేడాది మే నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. వాస్తవానికి ఏడాది శిక్ష ప్రకారం ఆయన.. మే నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే, జైల్లో సత్ప్రవర్తన దృష్ట్యా ఆయనకు 48 రోజులు శిక్ష నుంచి ఉపశమనం లభించిందని సిద్ధూ తరఫు న్యాయవాది వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు

కాంగ్రెస్‌ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కోర్టులో ఆర్ఎస్‌ఎస్‌ కార్యకర్త కమల్‌ బదౌరియా పరువునష్టం దావా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!

ఈ ద్రవ్యోల్బణ సమయంలో ఖర్చులు పోను జీతం మిగలడమే చాలామందికి కష్టంగా మారింది. కానీ యూఎస్‌(America)కు చెందిన 29 ఏళ్ల టాన్నర్‌ ఫర్ల్‌ అనే వ్యక్తికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడమంటే అలర్జీ అట. అందుకే  ఈ వయసుకే అతడు రూ.3 కోట్లు సేవ్‌ చేయగలిగాడు. మిన్నియాపోలిస్‌ ప్రాంతంలో నివసించే టాన్నర్‌కు వివాహమైంది. తనలాగే తన భార్యకు కూడా డబ్బు ఖర్చుపెట్టడమంటే ఇష్టముండదట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని