Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 03 Jun 2023 21:00 IST

1. రైలు ప్రమాదం.. 316మంది ఏపీ వాసులు సేఫ్‌, 141మంది ఫోన్లు స్విచ్ఛాఫ్

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా, 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు ఎంతమంది ఉన్నారనే దానిపై రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన అధికారులు.. రైల్వేశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వివరాలు సేకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘కోరమాండల్‌’ కాస్త ముందొచ్చుంటే మరింత ఘోరం జరిగేది!

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులు మాత్రం సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్సు రైలు ఆగి ఉన్న లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్లే  ఘోరం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలపై రాష్ట్రమంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరారవు విశాఖలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. తీసుకోవాల్సిన సహాయక చర్యలపై మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్‌ సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం 9.40 నిమిషాలకు తన న్యాయవాదులతో కలిసి ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. 10.30 గంటల సమయంలో సీబీఐ అధికారులు కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించారు. దాదాపు 7గంటలపాటు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పొగాకు హెచ్చరిక నిబంధనలపై OTTల అభ్యంతరం..!

థియేటర్ల తరహాలోనే ఓటీటీల్లోనూ ఇకపై పొగాకు వ్యతిరేక హెచ్చరికలను  తప్పనిసరి చేయడంపై ఓటీటీ వేదికల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఇతర వినోద కార్యక్రమాల్లోనూ ఈ నిబంధనను పాటించాలని కేంద్రం సూచించడంపై ఆయా వేదికలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా తీసుకొచ్చిన నిబంధనను సవాల్‌ చేయాలని ఓటీటీ వేదికలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామన్నారు. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పర్యటించి ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 20 ఏళ్లలో 3 సార్లు కోరమాండల్‌కు ప్రమాదం.. రెండు ఒడిశాలోనే!

ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాద ఘటనల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం నాటి ఘటనతో కలిపి ఇదే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గడిచిన 20 ఏళ్లలో మూడు సార్లు ప్రమాదానికి గురైంది. హవ్‌డా- చెన్నై మధ్య నడిచే ఈ రైలు.. మూడుసార్లూ చెన్నై వెళ్లే క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?.. వెలుగులోకి ట్రాఫిక్‌ ఛార్ట్‌

ఒడిశాలోని (Odisha) బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మంది మృతి చెందగా.. 900 మందికి పైగా  క్షతగాత్రులైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలియజేసే ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ (Rail Traffic Chart) తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 250 మంది ప్రయాణికులతో చెన్నైకి ప్రత్యేకరైలు

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో క్షేమంగా బయటపడిన 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నై తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్‌ P/13671 రైలు భద్రక్‌ స్టేషన్ నుంచి బయల్దేరి.. బహనాగలో ప్రయాణికులను ఎక్కించుకొని.. ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని రైల్వే అధికారులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘కవచ్‌ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్‌ రూపకర్త

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనతో (Odisha train accident) యావత్‌దేశం ఉలిక్కిపడింది. ఈ రైలు ప్రమాదానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. అయితే, రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టడాన్ని నివారించే కవచ్‌ (Kavach) వంటి వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వందేభారత్‌ రూపకర్త కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని