Odisha Train Tragedy: ‘కవచ్‌ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్‌ రూపకర్త

ఒడిశా రైలు ప్రమాదాన్ని (Odisha train accident) నివారించడంలో కవచ్‌ వ్యవస్థ ఉపయోగపడకపోయేదని భావిస్తున్నట్లు వందేభారత్‌ రూపకర్త వెల్లడించారు.

Updated : 03 Jun 2023 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనతో (Odisha train accident) యావత్‌దేశం ఉలిక్కిపడింది. ఈ రైలు ప్రమాదానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. అయితే, రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టడాన్ని నివారించే కవచ్‌ (Kavach) వంటి వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వందేభారత్‌ రూపకర్త కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ప్రమాదాన్ని నివారించడంలో కవచ్‌ వ్యవస్థ ఉపయోగం లేకపోయేదని అన్నారు.

‘కవచ్‌ ఉన్నా ఈ ప్రమాదాన్ని నివారించేది కాదని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారాన్ని చూస్తే.. అది సిగ్నలింగ్‌ విఫలమైనట్లు కనిపించడం లేదు. తొలి రైలు పట్టాలు తప్పడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొదటి రైలు ఎలా పట్టాలు తప్పిందోననే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలి’ అని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధాన్షు మణి (Sudhanshu Mani) పేర్కొన్నారు. అంతేకాకుండా అతివేగంతో వెళ్తున్నందున కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ బ్రేకులు వేయలేకపోయాడని అన్నారు. అయితే, రైల్వేశాఖ మాత్రం సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే ఇందుకు కారణంగా భావిస్తోంది.

రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాలను నివారించేందుకు రీసర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్ (RSDO).. మేధా సర్వో డ్రైవ్స్‌, కెర్నెక్స్‌ మైక్రో సిస్టమ్స్‌తో కలిసి ‘ట్రైన్‌ కొలిజన్‌ అవైడెన్స్‌ సిస్టమ్‌ (TCAS)’ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీన్నే ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ATP) సిస్టమ్‌, కవచ్‌గా పిలుస్తున్నారు. 2022లో దీనికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఎదురుగా మరో రైలు వస్తున్నప్పుడు లోకోపైలట్‌ బ్రేక్‌ వేయడంలో విఫలమైనప్పటికీ.. ‘కవచ్‌’ మాత్రం రైళ్ల వేగాన్ని పూర్తిగా తగ్గించి ప్రమాదాన్ని నివారిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు