Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 05 May 2023 20:59 IST

1. తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు.. ఇవాళ్టి నుంచే అమలు

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు సర్కారు వెల్లడించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ఫుల్‌ బాటిల్‌పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్‌పై రూ.60 వరకు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పార్టీ అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంటే మంచిది: బాలినేని శ్రీనివాసరెడ్డి

వైకాపా కోసం ఎంతో కష్టపడ్డానని.. పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకున్నారు. అనవసరంగా నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పది రోజుల్లో టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం: మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో పది రోజుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మంత్రి సమావేశం అయ్యారు. కొత్త విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ ఆలోచనను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వివరించామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజీనామా వెనక్కి.. నూతనోత్సాహంతో పనిచేస్తానన్న పవార్‌

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి (NCP) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శరద్‌పవార్‌.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన.. నూతనోత్సాహంతో పార్టీ అధినేతగా కొనసాగుతానని అన్నారు. పవార్‌ రాజీనామాను పార్టీ నియమించిన కమిటీ తిరస్కరించిన కొన్ని గంటల్లోనే మీడియా ముందుకు వచ్చిన పవార్‌ ఈ ప్రకటన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూరంగా ఉంటా: ఇన్‌స్టాలో కేఎల్‌ రాహుల్‌

ఐపీఎల్‌ 2023 టోర్నీలో (IPL 2023) బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌ తన గాయం పరిస్థితిని అభిమానులతో పంచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉగ్రఘాతుకం.. పేలుడులో ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రిషి సునాక్‌కు షాక్.. తొలి ‘ఎన్నికల పరీక్ష’లో ఓటమి..!

అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటున్న బ్రిటన్‌ (Britain) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల పోరులో ఆయన ఓటమిపాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) ఘోర పరాజయం దిశగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తల్లి గర్భంలోనే శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స.. అమెరికా వైద్యుల ఘనత

అమెరికా వైద్యులు(US Doctors) అరుదైన ఘనత సాధించారు. తల్లి గర్భంలోని శిశువు(Baby Still In Womb) మెదడుకు చికిత్స( Brain Surgery ) చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఆపరేషన్ ఇదే తొలిసారి కావడం విశేషం. బోస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు స్ట్రోక్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హీరోయిన్‌ను పెళ్లాడాలని విరాట్‌ అప్పుడే అనుకున్నాడా?

విరాట్‌ కోహ్లీ.. క్రికెట్‌ ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్‌. అతడు ఏది చేసినా ప్రత్యేకమే. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. బయట కూడా అంతే చలాకీ. ఇతరులను అభినందించాలన్నా.. తన అసహనాన్ని వెలిబుచ్చాలన్నా అతడికి అతడే సాటి. బాలీవుట్‌ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న తర్వాత ఈ జోడీ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఓ ఐకాన్‌గా మారిన ఈ జంట గత డిసెంబరులోనే 5 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సమంత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి: నాగచైతన్య

తన మాజీ భార్య, నటి సమంత మంచి మనసున్న వ్యక్తి అని నటుడు నాగచైతన్య అన్నారు. జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన తదుపరి చిత్రం ‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సమంతతో విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం విడాకులు తీసుకున్నామని ఆయన మొదటిసారి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని