Virat Kohli: హీరోయిన్‌ను పెళ్లాడాలని విరాట్‌ అప్పుడే అనుకున్నాడా?

ఓ హీరోయిన్‌ను పెళ్లాడాలని చిన్నప్పుడే విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అనుకున్నాడని, అతడి చిన్ననాటి స్నేహితుడి తల్లి నేహా సోంధి తెలిపారు. ఆర్‌సీబీ సోషల్‌ మీడియా విభాగం ఆమెను పలకరించగా.. కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Published : 05 May 2023 19:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ.. క్రికెట్‌ ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్‌. అతడు ఏది చేసినా ప్రత్యేకమే. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. బయట కూడా అంతే చలాకీ. ఇతరులను అభినందించాలన్నా.. తన అసహనాన్ని వెలిబుచ్చాలన్నా అతడికి అతడే సాటి. బాలీవుట్‌ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న తర్వాత ఈ జోడీ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఓ ఐకాన్‌గా మారిన ఈ జంట గత డిసెంబరులోనే 5 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీ సోషల్‌ మీడియా విభాగం.. కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అతడి చిన్ననాటి స్నేహితుడి తల్లిని, ఆయనకు క్రికెట్‌ మెళకువలు రాజ్‌కుమార్‌ శర్మను పలకరించింది.

చిన్నప్పుడు కోహ్లీ చాలా హుషారుగా ఉండేవాడని, ఓ పట్టాన ఎవరి మాటా వినేవాడు కాదని అతడి చిన్ననాటి స్నేహితుడు షల్‌ సోంధి తల్లి నేహా సోంధి అన్నారు. అతడి ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉండేవని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అప్పట్లో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.‘‘ ఒక రోజు దిల్లీలోని మదన్‌లాల్ అకాడమీకి నేను, కోహ్లీ, షల్‌ వెళ్తున్నాం. అక్కడ ఓ భారీ పోస్టర్‌ కనిపించింది. అందులో ఒక హీరోయిన్‌ ఫోజులిస్తోంది. ఆ పోస్టర్‌ను చూసిన కోహ్లీ.. ఏదో ఒక రోజు నేను కూడా ఎదుగుతాను, మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. ఓ హీరోయిన్‌ను పెళ్లాడతాను అన్నాడు. అదృష్టం కొద్దీ అలాగే ఎదిగాడు. హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాడు. చాలా గర్వంగా ఉంది’’ అంటూ నేహా సోంధి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది.

కోహ్లీ, అతడి స్నేహితుడు షల్‌ సోంధి ఇద్దరూ రాజ్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలని చిన్ననాటి నుంచే కోహ్లీ దృఢ సంకల్పంతో ఉండేవాడని, అందుకు తగ్గట్లుగా చాలా కఠినంగా ప్రాక్టీస్‌ చేసేవాడని రాజ్‌కుమార్‌ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘‘అది 30 మే, 1998. కోహ్లీ తన తండ్రి, సోదరుడితో కలిసి నా దగ్గరికి వచ్చారు. అకాడమీలో చేరిన కొద్ది రోజులకే అందరిలోనూ కోహ్లీ ప్రత్యేకమని అర్థమైంది. చాలా చురుగ్గా ఉండేవాడు. కొంటె చేష్టలు చాలా ఎక్కువ. అలాగని నిబద్ధత కూడా ఎక్కువే. ఏదైనా పూర్తిగా నేర్చుకునే దాకా వదిలిపెట్టేవాడు కాదు. అకాడమీలో చేరిన తొలి రోజు నుంచే ఆటలో ఇతరులను డామినేట్‌ చేసేందుకు ప్రయత్నించేవాడు. నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం కోహ్లీలో పుష్కలంగా ఉంటాయి. అదే ఆయనకు ప్లస్‌ పాయింట్‌.’’ అని రాజ్‌కుమార్‌ శర్మ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని