Rishi Sunak: రిషి సునాక్‌కు షాక్.. తొలి ‘ఎన్నికల పరీక్ష’లో ఓటమి..!

బ్రిటన్‌ (Britain) స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు కీలకంగా మారాయి.

Published : 05 May 2023 19:37 IST

లండన్‌: అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటున్న బ్రిటన్‌ (Britain) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల పోరులో ఆయన ఓటమిపాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) ఘోర పరాజయం దిశగా ఉంది.

యూకే (UK) వ్యాప్తంగా 230 జిల్లాల్లోని 8వేలకు పైగా కౌన్సిల్‌ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి లెక్కింపు మొదలుపెట్టారు. ఇప్పటివరకు 65 జిల్లాల్లోని కౌన్సిల్‌ స్థానాలకు ఫలితాలను వెల్లడించగా.. అందులో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ (Labour Party) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఇప్పటికే దాదాపు 250 స్థానాలకు కోల్పోయింది. ఇక మరో ప్రతిపక్ష పార్టీ లిబరల్‌ డెమోక్రాటిక్‌ (Liberal Democrats) కూడా మెరుగైన స్థానాలను దక్కించుకుంది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే.. కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) ఇప్పటికే 10 జిల్లాల్లో పట్టు కోల్పోయింది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ.. ఫలితాల సరళిని చూస్తుంటే అధికార పార్టీకి ఘోర పరాజయం దిశగా సాగుతున్నట్లే కన్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఈ స్థాయిలో ఘోర వైఫల్యాన్ని చవిచూడటం  1990ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. అంతేగాక, రిషి సునాక్ (Rishi Sunak) నాయకత్వంలో టోరీలు (కన్జర్వేటివ్‌ పార్టీ) ఎదుర్కొన్న తొలి ప్రధాన ఎన్నికలివే. 2024 చివర్లో సార్వత్రిక ఎన్నికలకు  సెమీ ఫైనల్‌గా భావించే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సునాక్‌ పార్టీ ఓటమి పాలవ్వడం.. టోరీలను కలవరపెడుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలతో రిషి పాలనపై ప్రజల్లో కొంత ప్రతికూలత మొదలైంది.

తాజా ఫలితాలపై ప్రధాని సునాక్ (Rishi Sunak) స్పందిస్తూ ఓటమిని అంగీకరించారు. ఇలాంటి ఫలితం టోరీలకు అంత మంచిది కాదని అన్నారు. మరోవైపు వీటిపై లేబర్‌ పార్టీ నేతలు మాట్లాడుతూ.. ‘‘టోరీల వైఫల్యానికి ప్రజలు తగిన శిక్ష వేశారు. వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని