Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 Jun 2023 21:16 IST

1. మహారాష్ట్రలో పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది: కేసీఆర్‌

‘‘భారతదేశానికి ఏమైనా లక్ష్యం ఉందా? లక్ష్యం లేని దేశం ఎక్కడికి వెళ్తోంది. ఈ విషయం ఆలోచిస్తే నాకు భయం వేస్తోంది’’ అని భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారాస కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే కొందరికి లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలి: రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ధరణిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకుల సహకారంతో కొందరు అక్రమార్కులు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల ఆరోపించిన రేవంత్‌ రెడ్డి.. తాజాగా ధరణి పుట్టుక దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా ప్రైవేటు సంస్థకు అప్పగించారు? తద్వారా ప్రజలకు కలుగుతున్న నష్టం ఏమిటి? అనే  అంశాలను వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు.. ఆందోళన చేస్తున్న భారాస కార్యకర్తలు

అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు కూడా ఆదాయపు పన్నుశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవి రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో దాదాపు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. ఐటీ సోదాలు ఎప్పటికి ముగుస్తాయో స్పష్టత లేకపోవడంతో భారాస ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కులాల వారీగా భూ కేటాయింపులా?.. హైటెక్‌ రాష్ట్రంలో ఇదేం విధానం: హైకోర్టు

వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేయూ విశ్రాంత ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో ఖానామెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున కేటాయించిందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాట్సాప్‌లో మరో ఫీచర్‌.. ఒకే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు!

మన ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులున్నా.. ఆ రెండు నంబర్లతో ఒకేసారి వాట్సాప్‌ (WhatsApp) వాడలేం. ఒకవేళ అలా వాడాలంటే అయితే, క్లోనింగ్‌ యాప్‌ లేదంటే బిజినెస్‌ యాప్‌ వాడాల్సిందే. అలా కాకుండా వేర్వేరు అకౌంట్లను ఒకే యాప్‌లో వాడుకునే వీలుంటే ఎంత బాగుంటుందో కదూ! సరిగ్గా వాట్సాప్‌ సైతం అదే చేస్తోంది. ఒకటే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు (multi account) వాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉగ్రవాదిలా 18 గంటలు బంధించారు.. అందుకే ఛాతినొప్పి వచ్చింది: స్టాలిన్‌

మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు (Tamil Nadu) మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ (V Senthil Balaji)ని అరెస్టు చేసే క్రమంలో ఈడీ (ED) వ్యవహరించిన తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) మరోసారి తీవ్రంగా ఖండించారు. ఆయనను 18 గంటల పాటు బంధించి ప్రశ్నల పేరుతో వేధించారని, ఆ ఒత్తిడితోనే మంత్రికి ఛాతినొప్పి వచ్చిందని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భీకరమైన గాలులు..కుంభవృష్టి.. తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌

బిపోర్‌జాయ్‌ తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గుజరాత్‌ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తుపాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికన్‌ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా..!

అమెరికా (America) నుంచి సాయుధ డ్రోన్ల (MQ-9B Predator Drones) కొనుగోలుకు మార్గం సుగమమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అధ్యక్షతన గురువారం సమావేశమైన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (DAC) ఈ ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు భద్రతా కేబినెట్ కమిటీ (CCS) ఆమోదముద్ర వేయాల్సి ఉందని ఓ అధికారి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ రెండు దేశాల్లో.. ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా కప్‌

ఎట్టకేలకు ఆసియా కప్‌ (Asia Cup 2023) సంబరం సిద్ధమవుతోంది. రెండు దేశాల్లోని వేదికల్లో ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరుగుతుందని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌తో కూడిన టోర్నీ 18 రోజులపాటు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఏఐతో ఫొటో సృష్టి.. భవిష్యత్‌ భయానకం అంటూ మహీంద్రా ట్వీట్‌!

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ చాట్‌బాట్‌ (AI Chatbot)లతో మానవ మనుగడకు ప్రమాదమని కొందరు ఐటీ రంగ నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏఐ చాట్‌బాట్‌ల గురించి ఎలాంటి భయాలు అవసరంలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని