Revanth: ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలి: రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రూ.90వేల కోట్లు అప్పు చేసి వివిధ బ్యాంకులను నిండా ముంచిన, దివాలా తీసిన ఐఎల్‌ ఆండ్‌ ఎఫ్‌ఎస్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు.

Updated : 15 Jun 2023 20:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ధరణిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకుల సహకారంతో కొందరు అక్రమార్కులు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల ఆరోపించిన రేవంత్‌ రెడ్డి.. తాజాగా ధరణి పుట్టుక దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా ప్రైవేటు సంస్థకు అప్పగించారు? తద్వారా ప్రజలకు కలుగుతున్న నష్టం ఏమిటి? అనే  అంశాలను వివరించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 

ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌కు కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. రూ. వేల కోట్లు అప్పు తీసుకుని వివిధ బ్యాంకులను నిండా ముంచి, దివాలా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఒప్పందం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి చెందిన ధరణి నిర్వహిస్తున్న టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ 52.26 శాతం వాటాను ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు. టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపెనీకి ఇచ్చేసిందన్నారు. ఇప్పుడు ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించిన రేవంత్‌ రెడ్డి.. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని ధ్వజమెత్తారు. 

ధరణిలో ఇప్పటివరకు రూ.50వేల కోట్లు విలువైన 25 లక్షల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేయగా, జరుగుతున్న లావాదేవీలకు చెందిన డబ్బు ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం లేదని, అవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళ్తున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదని, ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళ్తున్నాయో గుట్టు రట్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ధరణి వ్యవహారంపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయస్థానాల తలుపు కూడా తడతామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని