BRS: మహారాష్ట్రలో పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది: కేసీఆర్‌

మహారాష్ట్రలో అనేక మంది నేతలు భారాస వైపు చూస్తున్నారు.. త్వరలోనే లక్షల సంఖ్యలో భారాస సభ్యత్వాలు నమోదవుతాయని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు.  

Updated : 15 Jun 2023 18:18 IST

నాగ్‌పుర్‌: ‘‘భారతదేశానికి ఏమైనా లక్ష్యం ఉందా? లక్ష్యం లేని దేశం ఎక్కడికి వెళ్తోంది. ఈ విషయం ఆలోచిస్తే నాకు భయం వేస్తోంది’’ అని భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారాస కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే కొందరికి లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు.. జనం గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది. దేశ ప్రజలు చంద్రుడు, నక్షత్రాలు కోరట్లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు.

ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని చెప్పారు. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన దిల్లీలోనూ ఇదే దుస్థితి. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రం. వివిధ పార్టీల నుంచి ఎందరో సీఎంలు వచ్చారు. కానీ, ఇక్కడి పరిస్థితులను మాత్రం ఏ సీఎం మార్చలేదు. మహారాష్ట్ర సంగతి పక్కన పెట్టండి .. దేశ రాజధానిలోనూ అదే దుస్థితి. దిల్లీలో తాగునీరే కాదు.. విద్యత్‌ కొరత సమస్య కూడా ఉంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో భాజపా ఓడింది.. కాంగ్రెస్‌ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలి. బరాక్‌ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో పాప ప్రక్షాళన జరిగింది. 

దేశంలో దళితుల, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందే. ఎస్సీల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదు. దేశం మారాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కవశాతం సాగుయోగ్యమైన భూమి ఉంది. మనం తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వొచ్చు. భగవంతుడు ఎన్నో వనరులు సమృద్ధిగా ఇచ్చినా ప్రజలకు ఎందుకీ కష్టాలు. ఉచిత విద్యుత్‌, ఉచిత నీరుతో తెలంగాణలో సాగును పండుగలా మార్చాం. ఇప్పుడు తెలంగాణ వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేసింది. రాష్ట్రంలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటోంది. పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం.  తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నాం. 

తాగునీరు కోసం బిందెలు పట్టుకుని తిరిగే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడాలేదు. రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని పారద్రోలాలా వద్దా? తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను డిజిటలైజ్‌ చేసి అవినీతికి అడ్డుకట్ట వేశాం. గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవి. ఇప్పుడు తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ లభిస్తోంది. రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. తెలంగాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు మరాఠా నేతలు అంటున్నారు. తెలంగాణ తరహాలో చేస్తే మరాఠా నేతలు దివాలా తీస్తారు.. ప్రజలు దీపావళి జరుపుకొంటారు. మహారాష్ట్రకే వెళ్తున్నారు.. మా మధ్యప్రదేశ్‌కు రావట్లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు భారాస పోరాడుతోంది. మహారాష్ట్రలో అనేక మంది నేతలు భారాస వైపు చూస్తున్నారు. త్వరలోనే లక్షల సంఖ్యలో భారాస సభ్యత్వాలు నమోదవుతాయి. మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది. త్వరలో పుణె, ఔరంగబాద్‌లో భారాస కార్యాలయాలు ప్రారంభిస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని