IT Raids: రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు.. ఆందోళన చేస్తున్న భారాస కార్యకర్తలు

ఇద్దరు భారాస ఎమ్మెల్యేల ఇళ్లల్లో, కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు.

Updated : 15 Jun 2023 20:43 IST

హైదరాబాద్‌: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లలో రెండో రోజు కూడా ఆదాయపు పన్నుశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవి రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో దాదాపు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. ఐటీ సోదాలు ఎప్పటికి ముగుస్తాయో స్పష్టత లేకపోవడంతో భారాస ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. రహదారిపై బైఠాయించి భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారాస ఎమ్మెల్యేలపై అక్రమంగా చేస్తున్న ఐటీ తనిఖీలను ఆపాలని డిమాండ్‌ చేశారు. 

జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లో నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మరి జనార్దన్‌ రెడ్డి, కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డిలు ఇళ్లలో ఒక్కో ఇంట్లో రెండు నుంచి మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవి గ్రూపు స్థిరాస్తి సంస్థ పేరున, హోటల్‌ ఎట్‌ హోం పేరుతో నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలకు, వీరు చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉండడంతో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. అయితే, ఈ రెండు సంస్థల్లో భాగస్వామ్యం కలిగిన ప్రజాప్రతినిధులు మరిన్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టడంతో.. ఇక్కడ వచ్చే ఆదాయాన్ని అక్కడ పెట్టుబడి పెట్టారన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని