Anand Mahindra: ఏఐతో ఫొటో సృష్టి.. భవిష్యత్‌ భయానకం అంటూ మహీంద్రా ట్వీట్‌!

ఏఐ (AI) ఆర్టిస్ట్‌ ఒకరు మహీంద్రా (Anand Mahindra) ఫొటోను డిజైన్‌ చేశారు. ఇది చూసిన ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఆ ఫొటోను షేర్‌ చేస్తూ.. ఏఐతో భవిష్యత్తు భయానకంగా ఉండబోతుందని అంటూ ట్వీట్ చేశారు. 

Published : 15 Jun 2023 18:17 IST

ముంబయి: సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ చాట్‌బాట్‌ (AI Chatbot)లతో మానవ మనుగడకు ప్రమాదమని కొందరు ఐటీ రంగ నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏఐ చాట్‌బాట్‌ల గురించి ఎలాంటి భయాలు అవసరంలేదని మరికొందరు అభిప్రాపడుతున్నారు. ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌ (Google Bard)ను తీసుకురాగా, మైక్రోసాప్ట్ (Microsoft) మాత్రం చాట్‌జీపీటీ సేవలను బింగ్‌ (Bing)లో అందిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే బింగ్‌లో ఇమేజ్‌ జనరేషన్‌ సాఫ్ట్‌వేర్‌ DALL-E టూల్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఈ టూల్‌తో యూజర్లు వేర్వేరు రకాల ఫొటోలను డిజైన్ చేయొచ్చు. ఉదాహరణకు ఏదైనా విహారయాత్రకు వెళ్లకుండానే.. ఈ టూల్‌తో అక్కడికి వెళ్లినట్లు ఫొటోను డిజైన్‌ చేసుకోవచ్చు. అలా, ఒక ఏఐ ఆర్టిస్ట్‌ ( AI Artist) ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ( Anand Mahindra) నవ్వుతూ హోలీ వేడుకల్లో (Holi Celebrations) పాల్గొన్నట్లు ఫొటోను డిజైన్‌ చేశాడు. అదికాస్తా ఆనంద్‌ మహీంద్రాకు చేరడంతో.. ఆయన దాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఏఐతో భవిష్యత్తు భయానకంగా ఉండబోతుందని ట్వీట్ చేశారు.

‘‘ఈ ఏఐ ఆర్టిస్ట్‌ ఎవరో కానీ, హోలీ సంబరాల్లో నేను ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు డిజైజ్‌ చేశాడు. అలానే.. నా బకెట్‌ లిస్ట్‌లో ఉన్న అన్ని పర్యాటక ప్రదేశాలకు నేను వెళ్లినట్లు కొన్ని జ్ఞాపకాలను సృష్టించమని నేను అతన్ని అడగాలనుకుంటున్నా. వాస్తవానికి నేను అక్కడికి వెళ్లకపోయినా.. కనీసం నేను అక్కడికి వెళ్లాననే జ్ఞాపకం నాకు ఉంటుంది. అయితే, ఏఐతో ఎంతో సులువుగా నకిలీ ఫొటోల డిజైన్‌ చేయడంతోపాటు నకిలీ వార్తలను సృష్టించవచ్చని నాకు అర్థమైంది. భవిష్యత్తు భయానకంగా ఉండబోతోంది’’ అంటూ మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కొందరు ఏఐకి మద్దతుగా, మరికొందరు ఏఐకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, గతంలో ఏఐతో క్రియేట్ చేసిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ఏఐ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదంటూ మహీంద్రా ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని