Stalin: ఉగ్రవాదిలా 18 గంటలు బంధించారు.. అందుకే ఛాతినొప్పి వచ్చింది: స్టాలిన్‌

మంత్రి సెంథిల్‌ బాలాజీని ఉగ్రవాదిలా నిర్బంధించి విచారించారని, ఆ ఒత్తిడితోనే ఆయనకు ఛాతి నొప్పి వచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ (MK Stalin,) ఆరోపించారు. భాజపా ఈడీతో రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

Updated : 15 Jun 2023 19:36 IST

చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు (Tamil Nadu) మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ (V Senthil Balaji)ని అరెస్టు చేసే క్రమంలో ఈడీ (ED) వ్యవహరించిన తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) మరోసారి తీవ్రంగా ఖండించారు. ఆయనను 18 గంటల పాటు బంధించి ప్రశ్నల పేరుతో వేధించారని, ఆ ఒత్తిడితోనే మంత్రికి ఛాతినొప్పి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం తన ట్విటర్‌ ఖాతాలో స్టాలిన్ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

‘‘సెంథిల్‌ బాలాజీ పట్ల ఈడీ ఎలా ప్రవర్తించిందో యావత్ దేశం చూసింది. ఇది పూర్తిక రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగమే. 10 ఏళ్ల నాటి కేసులో దర్యాప్తు అని చెప్పి ఆయనను గదిలో నిర్బంధించారు. మానసికంగా బలహీనులయ్యేలా చేశారు. నేను దర్యాప్తు చేసేందుకు వ్యతిరేకం కాదు. కానీ, ఓ ఉగ్రవాదిలా ఆయనను బంధించాల్సిన అవసరం ఏముంది? ఆయనేం పారిపోయే వ్యక్తి కాదు కదా..! విచారణకు సహకరిస్తానని ఆయన ఈడీ అధికారులకు చెప్పారు. అయినా వారు ఆయనను 18 గంటలు నిర్బంధించి ఎవర్నీ కలవనీయకుండా చేశారు. ఈడీ అధికారుల ఒత్తిడి వల్లే ఆయన ఛాతినొప్పికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు’’ అని స్టాలిన్‌ (MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమ్మల్ని రెచ్చగొట్టొద్దు..

ఈ సందర్భంగా భాజపా (BJP)పైనా స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో భాజపా అధిష్ఠానం తమ రాజకీయాలు చేస్తోంది. అంతేగానీ, ప్రజలను కలిసి రాజకీయాలు చేసేందుకు వారు సిద్ధంగా లేరు. అందుకే ప్రజలకు కూడా కాషాయ పార్టీపై విశ్వాసం పోయింది’’ అని దుయ్యబట్టారు. ‘‘ డీఎంకే కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు సాహసించొద్దు. పరిణామాలను మీరు (భాజపాను ఉద్దేశిస్తూ) భరించలేరు. మాకు కూడా అన్ని రకాల రాజకీయాలు తెలుసు. ఇది బెదిరింపు కాదు.. హెచ్చరిక’’ అని స్టాలిన్‌ అన్నారు.

రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సెంథిల్‌ బాలాజీని బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆ తర్వాత సెంథిల్‌ తీవ్ర ఛాతీ నొప్పికి గురవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో సెంథిల్‌ విలపించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈడీ అభ్యర్థన మేరకు చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఆసుపత్రికి వెళ్లి అక్కడే బాలాజీని విచారించారు. అనంతరం ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించినా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అక్కడే చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ సెంథిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు నేడు దాన్ని కొట్టేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని