TS High court: కులాల వారీగా భూ కేటాయింపులా?.. హైటెక్‌ రాష్ట్రంలో ఇదేం విధానం: హైకోర్టు

వెలమ, కమ్మ సంఘాలకు,శారదాపీఠం, జీయర్‌ వేదిక్‌ అకాడమీకి భూ కేటాయింపులపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Updated : 15 Jun 2023 18:59 IST

హైదరాబాద్‌: వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేయూ విశ్రాంత ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో ఖానామెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున కేటాయించిందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. 

కులాల వారీగా భూములు కేటాయించడమేంటని ఉన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కులాల వారీగా భూములు కేటాయించడం ఆర్టికల్‌ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ‘‘ప్రభుత్వం తీరు సమాజంలో కుల విభజనకు దారి తీసేలా ఉంది. 21వ శతాబ్దంలో.. హైటెక్‌ రాష్ట్రంలో ఇదేం విధానం? కులాల వారీగా భూ కేటాయింపులు అసంబద్ధం, తప్పు’’ అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు మాత్రమే భూములు ఇవ్వాలని, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి విధానాలు ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇరుకైన ఆలోచనలు వీడి.. విశాలంగా ఆలోచించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

శారదాపీఠం, జీయర్‌ అకాడమీకి భూముల కేటాయింపుపై విచారణ..

శారదాపీఠం, జీయర్‌ వేదిక్‌ అకాడమీకి భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి వేసిన పిటిషన్లపై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రూ.కోట్ల విలువైన భూములను ఎకరానికి రూపాయి చొప్పున ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏజీ ప్రసాద్‌.. సంప్రదాయాలు, వేదాలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. శారదాపీఠం, జీయర్‌ అకాడమీకి భూ కేటాయింపులపై కేబినెట్‌ నిర్ణయాల్లో తప్పేమీ లేదన్నారు. పిటిషన్లపై స్పందించాలని విశాఖ శారదాపీఠం, జీయర్‌ అకాడమీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ శారద పీఠానికి భూకేటాయింపుపై విచారణ జులై 24కి, జీయర్ అకాడమీకి భూకేటాయింపుపై విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది.

రెడ్డి కాలేజీ సొసైటీకి భూమి కేటాయింపుపై..

రెడ్డి కాలేజీ సొసైటీకి బద్వేల్‌లో భూమి కేటాయింపుపై సామాజిక కార్యకర్తలు రాజేశ్వరరావు, విజయ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిల్‌పైనా హైకోర్టు విచారణ చేపట్టింది. రూపాయికి ఎకరం చొప్పున 5 ఎకరాలు కేటాయించడం రాజ్యాంగవిరుద్దమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 2018లో భూమి కేటాయిస్తే అయిదేళ్ల తర్వాత పిల్‌ ఎందుకు వేశారని హైకోర్టు ప్రశ్నించింది. జీవోను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ తెలిపారు. పిల్‌ వేయడంలో జాప్యానికి కారణాలు, భూమి ప్రస్తుతం ఏ దశలో ఉందో అఫిడవిట్‌ వేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ 23కి వాయిదా వేసింది.

దర్శకుడు శంకర్‌కు భూ కేటాయింపుపై..

దర్శకుడు ఎన్‌.శంకర్‌కు మోకిలలో 5 ఎకరాల కేటాయింపుపై కరీంనగర్‌కు చెందిన జె.శంకర్‌ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో మరోసారి విచారణ జరిగింది. రూ.కోట్ల విలువైన భూమిని ఎకరం రూ.5లక్షలకే కేటాయించారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఎఫ్‌డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్‌కు ఉందని ఏజీ వివరించారు. సినీ స్టూడియో నిర్మాణం కోసం ఎన్‌.శంకర్‌కు భూమి కేటాయించినట్టు తెలిపారు. ఉమ్మడి ఏపీలో పలు సినీ స్టూడియోలకు భూములు కేటాయించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూమి కేటాయింపులో ఎలాంటి పక్షపాతం, నిబంధనల ఉల్లంఘన లేదని శంకర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థానికులను ప్రోత్సహించాలన్న విధానంలో భాగంగానే కేటాయించారన్నారు. భూ కేటాయింపులపై 2007 తర్వాత చట్టాలు మారాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జులై 5కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని