DAC: అమెరికన్‌ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా..!

అమెరికా నుంచి ప్రిడేటర్‌ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు రక్షణ శాఖలోని డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదం తెలిపింది. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఈ నిర్ణయం వచ్చింది.

Updated : 15 Jun 2023 19:56 IST

దిల్లీ: అమెరికా (America) నుంచి సాయుధ డ్రోన్ల (MQ-9B Predator Drones) కొనుగోలుకు మార్గం సుగమమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అధ్యక్షతన గురువారం సమావేశమైన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (DAC) ఈ ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు భద్రతా కేబినెట్ కమిటీ (CCS) ఆమోదముద్ర వేయాల్సి ఉందని ఓ అధికారి వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటన వేళ డీఏసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 30 డ్రోన్లతో కూడిన ఈ కొనుగోలు ఒప్పందం విలువ దాదాపు 3 బిలియన్‌ డాలర్లు. త్రివిధ దళాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. 

సరిహద్దులు, సాగరజలాల్లో నిఘా, శత్రు జలాంతర్గాముల వేట, సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడి వంటి అవసరాలకు ఈ డ్రోన్లను ఉపయోగించే వీలుంది. చాలాకాలంగా అమెరికా నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు భారత్‌ ఆసక్తి చూపుతోంది. అయితే, కొన్ని ఇబ్బందులతో ఈ ఒప్పందం ముందుకు వెళ్లడంలేదు. ఎట్టకేలకు డీఏసీ దీనికి ఆమోదం తెలిపింది. అమెరికాలో మోదీ- బైడెన్‌ల చర్చల అనంతరం దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. భారత్‌ ప్రస్తుతం రెండు అమెరికన్‌ ‘ఎమ్‌క్యూ-9బీ సీ గార్డియన్‌’ డ్రోన్లను లీజుకు తీసుకుని నడిపిస్తోంది. అవి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘానేత్రంగా పనిచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు