Biparjoy: భీకరమైన గాలులు..కుంభవృష్టి.. తీరాన్ని తాకిన బిపోర్‌జాయ్‌

బిపోర్‌జాయ్‌ తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి.

Updated : 15 Jun 2023 19:20 IST

అహ్మదాబాద్‌: బిపోర్‌జాయ్‌ తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గుజరాత్‌ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తుపాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120కి.మీ నుంచి 130కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

అర్ధరాత్రి 11.30 సమయంలో బిపోర్‌జాయ్‌ పూర్తిగా తీరం దాటే  అవకాశముందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా.. ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపారు. దీని ప్రభావంతో కచ్‌-సౌరాష్ట్ర ప్రాంతాలు, పోర్‌బందర్‌, ద్వారక, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, జునాగఢ్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల  మేర ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చినట్లు ఐఎండీ వెల్లడించింది.

బిపోర్‌జాయ్‌  తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు 1 లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంచారు. ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు రోడ్లుభవనాలశాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్‌శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.  అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ దళాలను కూడా రంగంలోకి దించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమ రైల్వే ఇప్పటివరకు 76 రైళ్లను రద్దు చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు