Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 22 May 2023 20:56 IST

1. జేపీఎస్‌ల రెగ్యూలరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (JPS) సర్వీసు క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం నిర్ణయం.. జంట నగరాలపై అణువిస్పోటం: రేవంత్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బినామీలు, బంధువర్గాలకు రూ. లక్షల కోట్ల ఆస్తులు కట్టబెట్టడమే హైదరాబాద్‌లో 111 జీవో రద్దు లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం జంట నగరాల పర్యావరణంపై అణువిస్పోటం లాంటిదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తాగునీటి సమస్య పేరు చెప్పి.. కేసీఆర్‌ సమస్యను చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఖర్గే, రాహుల్‌లతో నీతీశ్‌ భేటీ.. విపక్షాల ఐక్యతపై చర్చ

జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలను ఏకతాటిపై (Opposition Unity) తెచ్చేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్‌ గాంధీతోనూ (Rahul Gandhi) భేటీ అయ్యారు. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ముగ్గురు నేతలు చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరాయంటే?

ఐపీఎల్-16 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఈ సారి ఎన్నాడూ లేనంతగా హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లో చివరి బంతి వరకు ఫలితం తేలలేదు. అంతేకాదు లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌ వరకు చివరి ప్లేఆఫ్స్‌ బెర్తు తేలలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్‌ విజయం సాధించడంతో ఆఖరి బెర్తును ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అక్కడ ₹100 పెట్రోల్‌ కొన్నా ₹2వేల నోటే ఇస్తున్నారట!

దేశంలో రూ.2వేల నోట్ల(Rs 2000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకొంటున్నట్టు ఇటీవల ఆర్‌బీఐ(RBI) ప్రకటించడంతో పెట్రోల్‌ బంకుల వద్ద ఈ నోట్లతో చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. రూ.2వేల కరెన్సీ నోట్లతో ఇంధనం కొనుగోళ్లు కనీసం ఐదు రెట్లు పెరిగినట్టు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ జిల్లా పెట్రోల్‌ బంకుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ వాసు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. గులాబీల నగరం.. నెత్తుటి దారుల్లో మునిగిన వేళ..!

రష్యా చేస్తున్న దురాక్రమణతో (Russia Invasion) ఉక్రెయిన్‌ నగరాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌ (Ukraine) బలగాలు మాత్రం రష్యా సేనలను నిలువరిస్తూ తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా పైచేయి సాధించినట్లు రష్యా చెప్పుకుంటోన్న బఖ్‌ముత్‌లో (Bakhmut) పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నడవలేని స్థితి నుంచి ఎవరెస్ట్‌ శిఖరంపై నిలిచి.. అంతలోనే ప్రాణాలు విడిచి..!

పదిహేడళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చూసి మళ్లీ నడవడం కష్టమే అని తేల్చేశారు వైద్యులు. కానీ, అతడు కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో కోలుకుని తిరిగి నడవడమే గాక.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం (Mount Everest)పైకి ఎక్కి తన కల నెరవేర్చుకున్నాడు. అయితే, అదే అతడి చివరి ప్రయాణమవుతుందని అనుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వారి వైఫల్యం వల్లే ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేకపోయాం: డుప్లెసిస్

గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కి నిరాశే ఎదురైంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్‌ సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయడంతో విజయం ఖాయం అనుకున్నారు. కానీ, గుజరాత్ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో బెంగళూరు లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. వెన్నెల కిషోర్‌ ఇంట్లో నోట్ల గుట్టలు.. మంచు విష్ణు క్లారిటీ

నటుడు వెన్నెల కిషోర్‌ (Vennela Kishore)ను ఉద్దేశిస్తూ ఇటీవల మంచు విష్ణు (Manchu Vishnu) షేర్‌ చేసిన ఓ సరదా ఫొటో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ‘వెన్నెల కిషోర్‌ ఇంట్లో రూ.2000 నోట్ల గుట్టలు’ అనే క్యాప్షన్‌తో పలు  కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయా వార్తలను ఉద్దేశిస్తూ మంచు విష్ణు తాజాగా ట్వీట్‌ చేశారు. వెన్నెల కిషోర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, జోక్‌గా తాను ఆ ఫొటో షేర్‌ చేశానని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది.. సినీ ప్రముఖల సంతాపం

 ప్రముఖ నటుడు, ఆమదాల వలస అందగాడు శరత్‌బాబు (Sarath Babu) మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. శరత్‌బాబు మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు పలువురు నటీనటులు తెలుగు ఫిలిం ఛాంబర్‌ వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు, సోషల్‌మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని