Nitish-Rahul: ఖర్గే, రాహుల్‌లతో నీతీశ్‌ భేటీ.. విపక్షాల ఐక్యతపై చర్చ

విపక్షాల ఐక్యత (Opposition Unity) కోసం జరుగుతోన్న ప్రయత్నాల్లో భాగంగా బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) .. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్‌ గాంధీలతో (Rahul Gandhi) సమావేశమై చర్చలు జరిపారు.

Published : 22 May 2023 20:19 IST

దిల్లీ: జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలను ఏకతాటిపై (Opposition Unity) తెచ్చేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్‌ గాంధీతోనూ (Rahul Gandhi) భేటీ అయ్యారు. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ముగ్గురు నేతలు చర్చించారు. అయితే, గడిచిన నెలన్నరలో రాహుల్‌తో నీతీశ్‌ కుమార్‌ ఇలా సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసానికి నీతీశ్‌ కుమార్‌ చేరుకున్నారు. అక్కడే రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యతకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పట్నాలో విపక్ష నేతలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జేడీయూ చీఫ్‌ లలన్‌ సింగ్‌లు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ముందురోజు.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో (Arvind Kejriwal) నీతీశ్‌ కుమార్‌ చర్చలు జరిపారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమైన కేజ్రీవాల్‌కు తన సంఘీభావాన్ని ప్రకటించారు. మరోవైపు ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నీతీశ్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లాతోపాటు పలు విపక్ష నేతలు హాజరైన విషయం తెలిసిందే. దీని ద్వారా తాము ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం విపక్ష పార్టీలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

త్వరలో విపక్షాల భేటీ.. ఎక్కడో తర్వాత చెబుతాం!

కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలన్నీ త్వరలో సమావేశం కాబోతున్నాయి. అయితే, ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భేటీలో అధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు పాల్గొంటాయని వేణుగోపాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని