Bakhmut: గులాబీల నగరం.. నెత్తుటి దారుల్లో మునిగిన వేళ..!

పారిశ్రామిక నగరంగా పేరున్న బఖ్‌ముత్‌ (Bakhmut) నగరం.. గులాబీల నగరంగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలంగా రష్యా దురాక్రమణకు (Russia Invasion) కేంద్ర బిందువుగా మారిన ఈ నగరం ఇప్పుడు పూర్తిగా నాశనమైంది.

Published : 23 May 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా చేస్తున్న దురాక్రమణతో (Russia Invasion) ఉక్రెయిన్‌ నగరాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌ (Ukraine) బలగాలు మాత్రం రష్యా సేనలను నిలువరిస్తూ తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా పైచేయి సాధించినట్లు రష్యా చెప్పుకుంటోన్న బఖ్‌ముత్‌లో (Bakhmut) పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు గులాబీల నగరంగా పేరొందిన ఆ ప్రాంతం ఇప్పుడు భూమి మీద ఉన్న ఓ నరక కూపంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుకాక ముందు బఖ్‌ముత్‌ (Bakhmut) నగరం జనాభా సుమారు లక్ష మాత్రమే. దొనెత్స్క్‌ ప్రాంతంలో ఉన్న బఖ్‌ముత్కా నది ఈ నగరం మీదుగా ప్రవహిస్తుంది. అయితే, ఇది లోయప్రాంతంలో ఉండటం వల్ల శత్రుదేశాలను ఎదుర్కోవడం ఇక్కడ కష్టం. ఒకప్పుడు ఉప్పు తవ్వకాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం రైల్వే హబ్‌గా ఉంది. నాణ్యమైన వైన్‌ తయారీకి ఈ నగరం ఎంతో ప్రసిద్ధి. ప్రస్తుతం అదంతా ఒడెసా ప్రాంతానికి తరలిపోయింది. 1924 నుంచి 2016 వరకు ఈ ప్రాంతాన్ని అర్టెమొవస్క్‌గా పిలిచారు. సోవియట్‌ విప్లవకారుడికి నివాళిగా దీన్ని ‘ఆర్టెమ్‌’ అని పిలిచేవారు. అప్పట్లో దీన్ని వైన్‌, గులాబీల నగరంగా పిలిచేవారు. నగరంలోని ఓ వీధిలో రికార్డుస్థాయిలో దాదాపు 5వేల గులాబీ మొక్కలు ఉండేవట. దాంతో ఆ ప్రాంతం.. గులాబీల వీధి అని ప్రసిద్ధి చెందింది.

అంతా శిథిలమై..

పారిశ్రామిక నగరంగా పేరున్న ఈ గులాబీల నగరం కొంతకాలంగా రష్యా దురాక్రమణకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్చి నాటికి అక్కడ 3వేల మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు స్థానిక అధికారుల అంచనా. సుమారు ఎనిమిది నెలలుగా జరుగుతోన్న భీకర దాడులతో నగరం ప్రస్తుతం పూర్తిగా నాశనమయ్యింది. ఎక్కడ చూసినా శిథిల భవంతులే. ఫిరంగుల మధ్య కుప్పకూలిన నిర్మాణాలు, పౌరుల సమాధులతో నిండిపోయిన ప్రాంతంగా దర్శనమిస్తుంది. పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు ఒకేఒక్క రహదారి ఉందని.. దానికి ఉక్రెయిన్‌ సైనికులు ‘జీవ రహదారి’ (Road of Life) అని పేరుపెట్టుకున్నారు.

రష్యా సేనలు, వారి ప్రైవేటు సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ సేనలు అక్కడ 220 రోజులుగా వీరోచిత పోరాటం చేస్తున్నాయి. ఈ భీకర దాడుల్లో 20వేలనుంచి 30వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు అంచనా. ఇటు ఉక్రెయిన్‌ సైన్యం కూడా భారీగా ప్రాణనష్టం చవిచూసింది. ఇలా రష్యా సైన్యం చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ సైనికులు.. ఈ యుద్ధక్షేత్రాన్ని భూమ్మిదే అత్యంత నరకమైన ప్రదేశంగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో సుదీర్ఘకాలం పాటు పోరు కొనసాగడంతోపాటు సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయిన ఫ్రాన్స్‌లోని ‘వెర్డన్‌’తో పోల్చిచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని