Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Aug 2023 21:01 IST

1. భారాస విజయంపై అనుమానమే లేదు: సీఎం

వచ్చే ఎన్నికల్లో భారాస విజయంపై ఎవరికీ అనుమానమే లేదని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘సూర్యాపేట ప్రగతి నివేదన సభ’లో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల కంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. త్వరలోనే పింఛన్ల పెంపుపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. అలాగే సూర్యాపేట జిల్లాపై సీఎం వరాలు కురించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఓట్ల తొలగింపు.. భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె.భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన భారీ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి పీఏసీ చైర్మన్, తెదేపా నేత పయ్యావుల కేశవ్ గతంలో ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపులో అక్రమాలను నిర్ధారించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెదేపా సానుభూతిపరుడిపై వైకాపా నేతల దాడి

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాళ్లలో తెదేపా సానుభూతిపరుడు సర్వారెడ్డిపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. అతడి కారును కూడా ధ్వంసం చేశారు. గాయపడిన సర్వారెడ్డిని స్థానికులు గురజాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరోసారి అతడిపై వైకాపా నేతలు మరోసారి దాడి చేశారు. బలవంతంగా రెంటచింతల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బాపట్ల జిల్లాలో పడవ బోల్తా.. ముగ్గురి గల్లంతు

బాపట్ల జిల్లాలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. నిజాంపట్నం హార్బర్‌ ముఖద్వారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా.. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లి సాయివర్ణిక (25) సహా ఇద్దరు చిన్నారులు తనీష్‌ (7), తరుణేశ్వర్‌ (1) గల్లంతయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గంగోత్రి నుంచి వస్తుండగా ఘోరం.. ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా.. 27మందికి గాయాలయ్యాయి. 35మంది ప్రయాణికులతో బస్సు గంగోత్రి నుంచి వస్తుండగా గంగనమి వద్ద ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మద్యం దుకాణాల లక్కీడ్రాకు సర్వం సిద్ధం

తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో 1,31,964 దరఖాస్తుల వచ్చాయి. సోమవారం ఉదయం 10.30గంటల నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తు దారుల సమక్షంలోనే లక్కీడ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బీఎన్‌ రెడ్డిలో వైఎస్‌ షర్మిల ధర్నా.. అరెస్టు చేసిన పోలీసులు

గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ‘‘అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే.. మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టా? రానట్టా?’’ అని షర్మిల ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉల్లి ఎగుమతులపై సుంకం.. రైతుల నిరసనలు

ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40శాతం సుంకం విధించిన నేపథ్యంలో రైతులు నిరసనకు దిగారు. మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్‌నగర్‌ హోల్‌సేల్‌ మార్కెట్లో ఉల్లి వేలంపాటను తాత్కాలికంగా నిలిపివేశారు. రైతుల శ్రేయస్సుపై కేంద్రం వైఖరి మరోసారి బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023 ఛాంపియన్‌గా స్పెయిన్‌..

ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023 (FIFA Women's World Cup Final) ఛాంపియన్‌గా స్పెయిన్‌ (Spain) అవతరించింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0తో ఇంగ్లాండ్‌ (England)ను ఓడించి స్పెయిన్ తొలి టైటిల్‌ను అందుకుంది. కెప్టెన్ ఓల్గా కార్మోనా 29వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అజిత్‌ పవార్‌ ఓ వడ్రంగి పిట్ట : సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అజిత్‌ పవార్‌ను (Ajit Pawar) శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) వడ్రంగి పిట్టతో పోల్చారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో వ్యాసం రాసిన ఆయన.. అందులో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. వడ్రంగి పిట్టలాగే అజిత్ పవార్‌ మహారాష్ట్ర సీఎం శిందే (Eknath Shinde) కుర్చీకి కన్నం పెడతారని జోస్యం చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు